తమ సినిమాలు ఎలా ఉంటాయో ప్రి రిలీజ్ ఈవెంట్లలో వాటి మేకర్స్ చెప్పే మాటలకు.. ఆ తర్వాత సినిమాలో ఉన్న కంటెంట్‌కు అసలు పొంతన ఉండదు చాలా సందర్భాల్లో. ఇందుకు తాజా ఉదాహరణ.. వార్-2, కూలీ చిత్రాలు. వీటి గురించి అందులో భాగమైన వాళ్లు మామూలుగా చెప్పుకోలేదు. తీరా చూస్తే ఆ సినిమాలు అంచనాలకు దూరంగా నిలిచిపోయాయి. ‘వార్-2’ విషయానికి వస్తే.. తెలుగు ప్రి రలీజ్ ఈవెంట్లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లతో పాటు దర్శకుడు అయాన్ ముఖర్జీ, తెలుగు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ పెద్ద పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చారు. వాళ్ల మాటలకు కొంచెం దగ్గరగా కూడా లేదీ సినిమా.
ముఖ్యంగా ఆ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా రెండు కాలర్లూ ఎత్తడంతో పాటు హృతిక్‌తోనూ ఆ పని చేయించారు. తన సినిమాల గురించి అభిమానులకు భరోసా ఇవ్వడం కోసం తారక్ కాలర్ ఎత్తడం ఈ మధ్య రివాజుగా మారింది. ‘దేవర’కు ఒక కాలర్ ఎత్తిన తారక్.. ‘వార్-2’కు ఏకంగా రెండు కాలర్లు ఎత్తేశాడు. దీంతో అభిమానులు సినిమా గురించి చాలా ఎక్కువ ఊహించుకున్నారు.
ఐతే తారక్ ఇలా చేసినపుడే చాలా మంది హెచ్చరికలు జారీ చేశారు. ఇలా ప్రతి సినిమాకూ కాలర్ ఎత్తడాన్ని ఆనవాయితీగా మారిస్తే.. సినిమా బాగున్నా బాలేకున్నా ఆ పని చేయాల్సి ఉంటుందని.. తేడా కొడితే క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని.. ఇది మంచిది కాదని అన్నారు. ఇప్పుడు ఆ హెచ్చరికే నిజమైంది.
‘వార్-2’ రిజల్ట్ తేడా కొట్టడంతో తారక్, హృతిక్‌ల డబుల్ కాలర్ మూమెంట్ కామెడీ అయిపోయింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తాను పని చేసే సినిమాలకు ఫైర్ ఎమోజీలతో రివ్యూలివ్వడం అలవాటుగా పెట్టుకుని కొన్ని సినిమాల విషయంలో దొరికిపోయాడు. ఇది తన మీద ప్రెజర్ పెంచేస్తోందని.. తన క్రెడిబిలిటీ కూడా దెబ్బ తింటోందని.. అతను ఆ రకమైన రివ్యూలు ఆపేశాడు. అనిరుధ్‌కు ఎదురైన ఆ అనుభవమే ఇప్పుడు తారక్‌కూ ఎదురైంది. ఇక ముందు అతను కాలర్ మూమెంట్ ఆపేయక తప్పని పరిస్థితిని ‘వార్-2’ తీసుకొచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates