ఒకపక్క వర్షాలు పడుతున్నా తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి వాతావరణం నెలకొనడం బయ్యర్లలో ఆనందాన్ని నింపుతోంది. చాలా గ్యాప్ తర్వాత హాలు నిండుగా జనాన్ని చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వార్ 2కి ఉదయం నాలుగు గంటల నుంచి కూలికి అయిదు గంటల నుంచే షోలు మొదలుపెట్టడంతో జనాలతో బాగా హడావిడి కనిపించింది. బుక్ మై షోలో రెండు సినిమాలు పోటాపోటీగా ట్రెండింగ్ లో ఉండటం శుభ సూచకం. ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్లు కొంటున్న ఆడియన్స్ క్యూలతో బిసి సెంటర్లు కళకళలాడుతున్నాయి. ఇలాంటి సీన్లు చూసి నెలలు గడిచిపోయాయని చెప్పాలి.
టాక్స్ సంగతి పక్కనపెడితే వీకెండ్ దాకా ఇదే ఊపు కొనసాగిస్తే భారీ నెంబర్లు కళ్లజూడొచ్చు. కొత్త రిలీజుల వల్ల అనూహ్యంగా స్క్రీన్ కౌంట్ తగ్గిపోయిన మహావతార్ నరసింహకు అందుబాటులో ఉన్నది తక్కువే థియేటర్లే అయినా అవి కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ తో దూసుకుపోతుండటం గమనార్హం. ఒకవేళ కూలి, వార్ 2 లలో ఏదైనా ఆశించిన జోరు చూపించకపోతే దాని స్థానంలో మహావతార్ ని రీ ప్లేస్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకో మూడు రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో ఆక్యుపెన్సీలు నిలబెట్టుకోవడం జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ ముందున్న అతి పెద్ద సవాల్.
మళ్ళీ ఆగస్ట్ 27 దాకా చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేవు. మీడియం బడ్జెట్ వి ఒకటి రెండు వస్తున్నా వాటి మీద బజ్ లేని నేపథ్యంలో వార్ 2, కూలిలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకోవాలి. రవితేజ మాస్ జాతర ఇంకో రెండు మూడు రోజుల్లో పబ్లిసిటీ జోరు పెంచనుంది. సెప్టెంబర్ 5 మిరాయ్, ఘాటీ, మదరాసి వస్తున్న నేపథ్యంలో వాటికి కూడా ప్రమోషన్ల పర్వం మొదలవుతుంది. ప్యాన్ ఇండియా బడ్జెట్లతో వచ్చిన వార్ 2, కూలిలకు యునానిమస్ టాక్ వచ్చి ఉంటే కనీసం పదిహేను రోజులు నాన్ స్టాప్ బ్యాటింగ్ ఉండేది. ఇంకో రెండు మూడు రోజులు ఆగితే ఇవి ఏ స్థాయికి వెళ్ళబోతున్నాయనే క్లారిటీ వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates