కేవలం పదహారు కోట్లతో తీసిన ఒక మీడియం బడ్జెట్ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరు ఊహిస్తారు. కానీ కాంతార సాధ్యం చేసి చూపించింది. అందుకే దాని ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. హోంబాలే ఫిలిమ్స్ ఈసారి బడ్జెట్ ని కూడా అమాంతం పెంచేసింది. అయితే ఈ మూవీ ప్రారంభ దశ నుంచే విపరీతమైన అవాంతరాలు, ప్రమాదాలు ఎదురుకుంది. ఇదంతా దేవుడి శాపమని, ఆపమనే దానికి సూచనని రకరకాల ప్రచారం జరిగింది. దీనికి నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందిస్తూ కాంతార కష్టాల వెనుక అసలు కథ చెప్పారు.
కాంతార స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమాకు సంబంధించి జరిగింది తక్కువ ప్రమాదాలే. నవంబర్ 2024 కొల్లూరు సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కొందరు యూనిట్ సభ్యులు గాయపడ్డారు. తర్వాత జనవరి 2025లో మరొక సెట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ ఎవరికీ గాయాలు, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని నెలల క్రితం హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరా లాంటి పరికరాలు నీటిలో మునిగిపోయాయి తప్పించి ఎవరికి ఏం కాలేదు. కాంతార చాప్టర్ 1 మొదలుపెట్టడానికి ముందే గ్రామదేవత పంజుర్లీని అడిగితే కొన్ని అవాంతరాలు వచ్చినా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారని చెప్పింది.
దీంతో చిత్ర బృందం చిత్రీకరణ మొదలుపెట్టి దిగ్విజయంగా విడుదలకు రెడీ చేస్తోంది. మధ్యలో జరిగిన కొన్ని ప్రమాదాలు, మరణాలు షూట్ కి ఏ మాత్రం సంబంధం లేనివి. రోజు ఉదయం 6 గంటలకు మొదలయ్యే షూటింగ్ ఏకధాటిగా జరిగేది. దాని కోసం ఉదయం నాలుగు గంటలకే టీమ్ మొత్తం లేవాల్సి వచ్చింది. ఎనభై శాతానికి పైగా రియల్ లొకేషన్లలోనే కాంతార తీశారు. అక్టోబర్ 2 రిలీజ్ కాబోతున్న కాంతార చాప్టర్ 1 కు భారీ బిజినెస్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు కనివిని ఎరుగని రేట్ పలకొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates