‘శివ’ పొరపాటు చేయలేదు

అక్కినేని నాగార్జున కెరీర్ కే కాదు టాలీవుడ్ ఫిలిం మేకింగ్ లోనే కొత్త ట్రెండ్ కు దారి తీసిన శివ త్వరలో రీ రిలీజ్ కానుంది. నాగ్ పుట్టినరోజైన ఆగస్ట్ 29 విడుదల చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాట్లు చేస్తోంది. కూలీ స్క్రీనింగ్స్ తో పాటు ట్రైలర్ ని ప్రదర్శించబోతున్నారు. ఇదే డేట్ కి వేరే వర్గం రగడ రీ రిలీజ్ అనౌన్స్ చేసినప్పటికీ ప్రస్తుతానికి విరమించుకుని త్వరలో కొత్త డేట్ వేయబోతున్నారట. ఇప్పుడున్న ఎందరో ఫిలిం మేకర్స్ కి ఒక రిఫరెన్స్ బుక్ లా నిలిచిపోయిన శివని మళ్ళీ చూసేందుకు అభిమానులే కాదు ప్రేక్షకులూ రెడీ అవుతున్నారు.  ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి.

90 దశకంలో వచ్చిన బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ ఈ మధ్య ఆడియన్స్ కి కోరుకున్న ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో విఫలమయ్యాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆదిత్య 369, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు మొదలైనవి రీ మాస్టరింగ్ క్వాలిటీ సరిగా లేక సరైన అనుభూతి ఇవ్వలేదు. ప్రింట్లు, నెగటివ్ లు దొరక్కపోవడం ప్రధాన కారణంగా నిర్మాతలు చెప్పినప్పటికీ మూవీ లవర్స్ సంతృప్తి చెందలేదు. కానీ శివ ఆ పొరపాటు చేయలేదట. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటిదాకా వచ్చిన రీ రిలీజుల్లో నాణ్యత పరంగా శివ ది బెస్ట్ కానుంది. నాగార్జున బృందం దగ్గరుండి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది.

ఇళయరాజా కంపోజ్ చేసిన మోనో ట్రాక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని మళ్ళీ సరికొత్తగా డాల్బీలో రీమిక్స్ చేయడం తెలుగులో రెండోసారని చెప్పాలి. మాయాబజార్ కలర్ వెర్షన్ కు చేసిన ప్రయోగం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. అదే తరహాలో తగిన జాగ్రత్తలు తీసుకుని శివకి రీ క్రియేట్ చేశారని వినికిడి. ఇది కనక సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని ప్రయత్నాలు చూడొచ్చు. రామ్ గోపాల్ వర్మ అనే కల్ట్ దర్శకుడిని తెరకు పరిచయం చేసిన శివని ఇప్పటి జనరేషన్ రిసీవ్ చేసుకోవాలంటే ఇలాంటి హంగులు అవసరమే. అన్నట్టు శివ కనక సక్సెస్ అయితే ఇదే తరహాలో గీతాంజలిని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఐడియా బాగుంది.