బాలీవుడ్లో నటుడిగానే కాక వ్యక్తిగానూ మంచి ఇమేజ్ ఉన్న హీరో ఆమిర్ ఖాన్. గత కొన్నేళ్లలో కొన్ని అనవసర వివాదాలతో కాస్త చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కానీ.. బేసిగ్గా ఆమిర్‌కు వ్యక్తిగా మంచి పేరే ఉంది. అలాంటి వ్యక్తి మీద తన సోదరుడు సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆమిర్‌కు ఫైసల్ ఖాన్ అనే సోదరుడున్నాడు. వీళ్లిద్దరికీ చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో కోర్టులో వీరి మధ్య కేసు కూడా నడుస్తోంది. అతను తన అన్న మీద చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
తనను ఆమిర్ ఏడాది పాటు గదిలో బంధించినట్లు అతను మీడియాకు వెల్లడించాడు. కొన్నేళ్ల పాటు తాను అన్న వల్ల మనో వేదన అనుభవించినట్లు ఫైసల్ తెలిపాడు. తనకు మానసిక వ్యాధి వచ్చిందని.. తాను పిచ్చివాడినని.. సమాజానికి హాని చేస్తానని ఏవోవో అన్నారని.. కొన్ని విషయాల్లో తాను కుటుంబానికి సహకరించకపోవడంతో తనకు పిచ్చి అని వారు అనుకున్నారని ఫైసల్ తెలిపాడు.
తాను ఉచ్చులో కూరుకుపోయానని.. దాన్నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదని అతనన్నాడు. ఏడాది పాటు ఆమిర్ తనను ఒక గదిలో బంధించాడని.. తన ఫోన్ కూడా లాగేసుకున్నారని.. బయటికి రానివ్వలేదని అతను తెలిపాడు. తన గది బయట బాడీ గార్డులను పెట్టారని.. తనకు మందులు, తిండి మాత్రమే అందించేవారని గుర్తు చేసుకున్నాడు. తన సోదరుడు, ఇతర వ్యక్తుల నుంచి తన తండ్రి తనను కాపాడతాడని అనుకున్నానని.. కానీ ఆయన్ని ఎలా సంప్రదించాలో తెలియలేదని.. దీంతో ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చిందని ఫైసల్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఈ ఆరోపణలపై ఆమిర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates