జనసేన తీర్చని బాకీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్లీ వచ్చాక చకచకా సినిమాలు ఓకె చేసారు. ఇంకా చేస్తారేమో తెలియదు. ఇలా ఓకె చేసిన వాటిలో చివరి సినిమా నిర్మాత రామ్ తాళ్లూరిది. ఈ సినిమా ఓకె చేయడం వెనుక ఆసక్తికరమైన సంగతి వుందని టాక్ వినిపిస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా కన్నా, జనసేన మద్దతు దారుగా, జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని భారీగా నిర్వహించిన వ్యక్తిగానే ఎక్కువ పరిచయం. ఆ తరువాత ఆ దుకాణం తీసేసారు.

అయితే కేవలం పార్టీ సింపతైజర్ గా ఈ విభాగాన్ని నిర్వహించలేదని, నామినల్ ఖర్చులు పార్టీ భరించేలా కుదిరిన ఒప్పందం మేరకు ఆ తెల్ల ఏనుగును భరించారని, కానీ ఆ ఖర్చుల బిల్లు నేటికీ చెల్లు కాలేదని తెలుస్తోంది. ఆ బిల్లు మొత్తం సుమారుగా తొమ్మిది కోట్ల వరకు వుంటుందట.

ఈ మేరకు ఏనాడో డిటైల్డ్ గా బిల్లు పెట్టాడట రామ్ తాళ్లూరి. కానీ ఇప్పటికి పేమెంట్ కాలేదని బోగట్టా. ఇప్పుడు ఆ మొత్తాన్ని అడ్వాన్స్ గా మార్చి, సినిమా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబోను రామ్ తాళ్లూరి సెట్ చేసుకున్నారు. కానీ పవన్ కు సురేందర్ రెడ్డి మీద అంత ఆసక్తి లేదని కూడా గ్యాసిప్ వుంది. మొత్తానికి సినిమా ఎప్పుడు చేయాలో? బాకీ ఎప్పుడు తీరాలో?