కొత్త మార్పుకు శ్రీకారం – TFCC నిర్ణయం

ఖచ్చితంగా ముప్పై శాతం వేతనాలు పెంచితే తప్ప పనిలోకి రామని తెగేసి చెప్పిన వర్కర్స్ ఫెడరేషన్ కు టాలీవుడ్ నిర్మాతలు ధీటైన సమాధానం ఇచ్చారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో తలసరి ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామని, అయినా సరే ప్రొడ్యూసర్లను బెదిరించే రీతిలో లెటర్లు ఇవ్వాలని, ఏ రోజుకారోజు పేమెంట్లకు చేయాలని కండీషన్లు పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనం ఇచ్చే సంస్థలకు ఎవరినైనా తీసుకునే హక్కు ఉంటుందని, యూనియన్ సభ్యత్వంతో సంబంధం లేదని స్పష్టమైన ఆధారాలను పేర్కొంటూ వివరణ విడుదల చేసింది.

ఈ సందర్భంగా కార్మిక శాఖా కమీషనర్, కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా మార్గదర్శకాలను ఫిలిం ఛాంబర్ పెద్దలు లేఖలో పొందుపరిచారు. ఇకపై ఏదైనా సినిమాకు పని చేయాలనుకున్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి మెంబర్ షిప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇచ్చే వేతనం సంతృప్తికరంగా అనిపిస్తే ఎవరిదగ్గరైన చేరొచ్చని అందులో స్పష్టం చేశారు. సో ఇకపై ఫెడరేషన్ పేరుతో ఎవరైనా షూటింగ్స్ ని అడ్డుకోవడం లాంటివి చేస్తే చట్టపరంగా చర్యలు ఎదురుకునే పరిస్థితి తలెత్తుంది. వేతనాల విషయంలో ఫెడరేషన్ మరీ విపరీతమైన పెంపు కోరిందని, రీజనబుల్ గా అడిగి ఉంటే సానుకూల స్పందన వచ్చేదని పెద్దల మాట.

ఏది ఏమైనా ఇప్పుడీ పరిణామాలు కొత్త మార్పుని సూచిస్తున్నాయి. యునియన్ల పేరుతో జరుగుతున్న వ్యవహారాలకు చెక్ పెట్టే దిశగా ఇది మొదటి అడుగుగా భావించవచ్చు. అయితే ఫెడరేషన్ దీని గురించి ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లీగల్ పాయింట్లతో నిర్మాతలు సమాధానం ఇచ్చారు కాబట్టి అంతే లాజికల్ గా బదులు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే చేయడానికి ఏమీ ఉండదు. సమ్మె లెటర్ వల్ల ఆగస్ట్ 4 షూటింగులు బాగా ప్రభావితం చెందాయి. ఈ విషయం గురించి నిర్మాతలు ఏపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.