స్వయానా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మీలా నేను నటించలేను అంటూ ఏ హీరోనైనా మెచ్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. నాగార్జునకు ఆ అవకాశం దక్కింది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన కూలి ప్రీ రిలీజ్ కం ప్రెస్ మీట్ లో తలైవర్ వీడియో ద్వారా అందుబాటులోకి వచ్చి తన మనసులో భావాలు పంచుకున్నారు. సైమన్ గా నాగ్ తన క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించారని, బాషాలో ఆంటోనీ లాగా కూలిలో సైమన్ శాశ్వతంగా గుర్తుండిపోతాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. కింగ్ ఎనర్జీ, ఎక్స్ పీరియన్స్ గురించి ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించి అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చారు.
ఇక్కడ కాకతాళీయంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. రఘువరన్ అనే విలన్ కి సూపర్ బ్రేక్ ఇచ్చింది నిర్మాత నాగార్జునే. శివ ద్వారా దాన్ని సాకారం చేశారు. తర్వాత ఆయన పెద్ద స్థాయికి చేరుకోవడం చూశాం. బాషాలో ఆంటోనీగా రఘువరన్ పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడా స్థాయిలో కూలిలో నాగ్ పోషించిన సైమన్ ఉంటుందని రజిని స్వయంగా చెప్పడం విశేషం. నాగార్జున తన అనుభవాన్ని పంచుకుంటూ హీరోతో సమానంగా తనకు ప్రాధాన్యం ఉండటం గుర్తించి ఈ కథను రజనీకాంత్ గారు నిజంగా ఒప్పుకున్నారా అని లోకేష్ కనగరాజ్ ని అడిగానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ట్రైలర్ వచ్చాక కూలి మీద రకరకాల అంచనాలు ఏర్పడ్డాయి. తెలివిగా కట్ చేయడంతో జానర్, కథ లాంటివి ఎక్కవుగా డీకోడ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఇదేమి టైం ట్రావెల్ సినిమా కాదని చెబుతున్న లోకేష్ థియేటర్లో చూశాక సర్ప్రైజ్ అవుతారని చెప్పుకొచ్చాడు. సత్యరాజ్ మాట్లాడుతూ 38 సంవత్సరాల తర్వాత కలుసుకున్నా, మేకప్ లో చూస్తే రజనీకాంత్ లో ఎలాంటి మార్పు లేదని, అదే విషయం ఆయనకు చెబితే నాదేముంది నాగార్జునని కలుసుకో ఆయన ఇంకా ఫిట్ గా ఉన్నాడని చెప్పారట. మొత్తానికి నాగార్జున కెరీర్ లో మొదటిసారి తీసుకున్న రిస్క్ ఎలాంటి ఫలితమిస్తుందో ఆగస్ట్ 14 తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates