రూపాయికి రూపాయి లాభం వస్తే వంద శాతం ప్రాఫిట్ అంటాం. అదే పది ఇరవై రూపాయలు వస్తే దాన్ని ఎంత పర్సెంటేజ్ అంటాం. బయట వ్యాపారాల్లో ఇలాంటివి చూస్తుంటాం కానీ సినీ పరిశ్రమలో చాలా అరుదు. పెట్టిన పెట్టుబడి మీద ఎంతో కొంత మిగిలితే చాలనే నిర్మాతలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం కళ్లుచెదిరే లాభాలతో పక్కనోళ్ళకు నిద్ర రాకుండా చేస్తాయి. శాండల్ వుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సు ఫ్రమ్ సో సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. మొన్న జూలై 25 మహావతార్ నరసింహతో పాటుగా రిలీజై కర్ణాటకలో స్టార్ హీరోల రికార్డులు బద్దలు కొట్టే పనిలో ఉంది.
సు ఫ్రమ్ సోకు పెట్టిన బడ్జెట్ కేవలం 3 కోట్లు. ఇప్పటిదాకా వసూలైన గ్రాస్ 40 కోట్లకు దగ్గరగా ఉంది. నెట్ లెక్కల్లో చూసుకుంటే 30 కోట్ల దాకా తేలుతుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ సూత్రం ప్రకారం ఇది సుమారుగా 878 శాతం దాకా తేలుతుంది. బుక్ మై షోలో కన్నడ సినిమాల పరంగా ఇప్పటిదాకా టాప్ లో ఉన్నవి దర్శన్ కాటేరా, సుదీప్ మ్యాక్స్. వాటి తర్వాతి స్థానంలో సు ఫ్రమ్ సో ఉంది. ఫైనల్ రన్ అయ్యేలోపు వాటిని టచ్ చేసినా, దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అక్కడి ట్రేడ్ టాక్. బెంగళూరు లాంటి నగరాల్లో ఆదివారం ఉదయం ఆరు గంటలకు షోలు వేస్తున్నా హౌస్ ఫుల్స్ పడటం గతంలో ఏ చిన్న సినిమాకు జరగలేదు.
ఇక స్టోరీ పరంగా చూసుకుంటే ఇదో హారర్ కామెడీ డ్రామా. ఓ పల్లెటూరి కుర్రాడికి సులోచన అనే దెయ్యం పడుతుంది. అక్కడి నుంచి సరదా సంఘటనలతో ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఎలాంటి బూతులు లేకుండా నవ్వించడంలో కొత్త దర్శకుడు జెపి తుమినాధన్ వంద శాతం మార్కులు తెచ్చేసుకున్నాడు. దీన్ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఆగస్ట్ 8 రిలీజ్ చేయనుంది. అటుపై ఆరు రోజుల్లో వార్ 2, కూలి వస్తున్న నేపథ్యంలో వన్ వీక్ రన్ చాలానే ఉద్దేశంలో విడుదల చేస్తున్నారు. మన దగ్గర సక్సెసైన కమిటీ కుర్రాళ్ళు తరహాలో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉన్న సు ఫ్రమ్ సో మన ప్రేక్షకులకు నచ్చే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates