నిన్న ప్రకటించిన 71వ జాతీయ అవార్డుల్లో షారుఖ్ ఖాన్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం చాలా మందికి రుచించడం లేదు. కారణం వ్యక్తిగతంగా కింగ్ ఖాన్ మీద అయిష్టంతో కాదు. ఈ గౌరవం ఇవ్వడానికి జవాన్ ని ఎంచుకోవడమే ఈ అసంతృప్తికి దారి తీస్తోంది. నిజానికి జవాన్ ఒక రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ మూవీ. డ్యూయల్ రోల్ లో షారుఖ్ అదరగొట్టాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్స్ లో బాగా కుదిరాయి. అంతకు మించి దర్శకుడు అట్లీ చూపించిందంతా రొటీన్ వ్యవహారమే,. కాకపోతే మాస్ జనాలకు విపరీతంగా నచ్చేసి వందల కోట్లు వసూళ్ల రూపంలో కురిపించారు.
సమస్య ఏంటంటే షారుఖ్ బెస్ట్ యాక్టర్ అనిపించుకోవడానికి జవాన్ ని ఎంచుకోవడం నెటిజెన్లకు నచ్చడం లేదు. గతంలో తను ఎన్నో గొప్ప క్లాసిక్స్ లో నటించాడు. స్వదేస్ ఇప్పుడు చూసినా గుండెల్లో ఎక్కడో తడి తగులుతుంది. దేవదాస్ లో దిలీప్ కుమార్ ని తలపించేలా షారుఖ్ విశ్వరూపం చూపిస్తాడు. రబ్ నే బనాదీ జోడిలో రెండు షేడ్స్ ని ఆయన పోషించినంత గొప్పగా వేరొకరిని ఊహించుకోలేం. నెగటివ్ షేడ్స్ లోనూ డర్, అంజామ్, బాజీగర్ లాంటివి ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయాయి. అశోక, దిల్ సే ఫ్లాప్ అయినా సరే షారుఖ్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తాయి. కానీ జవాన్ వాటి సరసన చేరేది కాదనేది మూవీ లవర్స్ కామెంట్.
ఇందులో నిజం లేకపోలేదు. జవాన్ బ్యాడ్ మూవీ కాదు. అలాని జాతీయ అవార్డుకు అర్హత ఇచ్చేంత కంటెంట్ ఉందా అంటే ఏమో చెప్పలేం. గత కొన్నేళ్లుగా ఈ పురస్కారాల్లో కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాల ఎంపిక గణనీయంగా పెరిగింది.దాని వల్లే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. డిబేట్ల సంగతి ఎలా ఉన్నా షారుఖ్ అభిమానులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ప్రెసిడెంట్ చేతుల మీదుగా వార్డు తీసుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఏమో కానీ జవాన్ దర్శకుడు అట్లీ మాత్రం ఖచ్చితంగా గర్వపడే క్షణమిది. లెజెండరి డైరెక్టర్లు ఇప్పించలేకపోయిన నేషనల్ అవార్డు తన వల్ల దక్కింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates