వీకెండ్ నిలబడితే విజయ్ గెలిచినట్టే

నిన్న విడుదలైన కింగ్డమ్ గురువారం రిలీజ్ ఎంచుకోవడం ద్వారా తీసుకున్న రిస్క్ కు తగ్గట్టు మంచి ఫలితాన్ని అందుకుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 నుంచి 40 కోట్ల మధ్య గ్రాస్ రావొచ్చని ట్రేడ్ ప్రాధమిక అంచనా. నాని పేరు మీదున్న టయర్ 2 ఫస్ట్ డే రికార్డుని దాటుతుందేమోననే అంచనాలు అందుకోలేకపోవడం ఫ్యాన్స్ కొంత లోటుగా ఫీలవుతున్నారు. అయినా వర్కింగ్ డేలో ఇంత ఓపెనింగ్ దక్కించుకోవడం మాములు విషయం కాదు. నిన్న దాదాపు అన్ని సెంటర్లలో భారీ ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్స్, మధ్యాన్నం, సాయంత్రానికి అదనపు షోలు జోడించడం బుకింగ్ యాప్స్ లో కనిపించింది.

ఇదంతా బాగానే ఉంది కానీ కింగ్డమ్ కు యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ గురించి ఏదైతే రివ్యూస్ లో ప్రస్తావించారో సరిగ్గా దాని మీదే కామన్ ఆడియన్స్ కూడా కంప్లయింట్ చేస్తున్నారు. రెండో భాగం కోసం విజయ్ దేవరకొండను సైడ్ చేసి అండర్ ప్లే చేయించడం దర్శక నిర్మాతల కోణంలో ఎలా ఉన్నా ప్రేక్షకులకు అదే కొంచెం మైనస్ గా తోస్తోంది. ఇప్పుడు మూడు రోజుల పెద్ద వీకెండ్ సిద్ధంగా ఉంది.. ఒకవేళ కింగ్డమ్ కనక స్థిరంగా ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే సులభంగా బ్రేక్ ఈవెన్ దాటిపోవడమే కాక ప్రాఫిట్ జోన్ లోకి అడుగు పెట్టొచ్చు. నిర్మాత ఆ ధీమాతోనే ఉన్నారు.

హరిహర వీరమల్లు అనుకున్న దానికన్నా చాలా ముందుగా ఫైనల్ రన్ కు వచ్చేస్తోంది. సో కింగ్డమ్ కు తెలుగులో పోటీ లేదు. హిందీ నుంచి సన్నాఫ్ సర్దార్ 2, దఢక్ 2లు వస్తున్నా వాటి ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో తప్ప మన దగ్గర పెద్దగా ఉండదు. యుఎస్ లో వన్ మిలియన్ దాటేసిన విజయ్ దేవరకొండ మరోసారి అక్కడ తన స్టామినా ఋజువు చేశాడు. టాక్ ఎలా ఉన్నా స్టడీగా కనీసం ఓ అయిదారు రోజుల పాటు కింగ్డమ్ కనక వసూళ్లు రాబడితే హిట్టు స్టాంప్ పడొచ్చు. ఇవాళ సాయంత్రానికి శని ఆదివారాల అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉండబోతున్నాయో ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఒక అంచనాకు రావొచ్చు.