బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం ఒక ట్రెండుగా మారిపోయింది. దాన్ని అనుసరించి మరి కొన్ని సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి. పుష్ప 2, కేజీఎఫ్-2 లాంటి చిత్రాలను ఈ కోవలో చెప్పుకోవచ్చు. ఇది సినిమాకు ఎక్కువ ఖర్చు పెట్టుకుని, ఎక్కువ ఆదాయం రాబట్టుకోవడానికి.. కథ పరిధి పెంచుకోవడానికి ఒక మార్గంగా మారింది. ఐతే ఈ ఫార్ములా అన్ని సినిమాలకూ పని చేయట్లేదు. ప్రేక్షకుల స్పందన కూడా ఆశించిన విధంగా ఉండట్లేదు. పార్ట్-2ను ప్రకటించి తీయకుండా ఆగిపోయిన, తీసినా వర్కవుట్ కాని సినిమాల జాబితా పెద్దదే. గత ఏడాది ఇండియన్-2 విషయంలో ఇలాగే పెద్ద బ్లండర్ చేశాడు శంకర్. ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు కూడా ఇదే ఫార్ములాను అనుసరించి దెబ్బ తిన్నారు.
మొదటి భాగంలో కథను సరిగా చెప్పక ఇది చెడిపోయి, ఈ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడంతో తర్వాతి భాగం మీద ఆసక్తి లేకుండా పోయింది. టాలీవుడ్ లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్‌కు కూడా దాదాపు ఇలాంటి సమస్యే తలెత్తింది. ముందు చెప్పుకున్న సినిమాల స్థాయిలో ఈ సినిమా నిరాశపరచలేదు కానీ.. పార్ట్-2 ఐడియా వల్ల దీనికి కూడా డ్యామేజ్ జరిగిందన్నది స్పష్టం. కింగ్‌డమ్ కథ ఎత్తుగడ, ఒక దశ వరకు కథనం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ద్వితీయార్ధాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అనుకున్నంత బాగా తెరకెక్కించలేకపోయాడు. కథను మధ్యలో ఆపడం.. ముఖ్యమైన అనేక విషయాలను రెండో భాగంలో చూడాలన్నట్లు చివర్లో లీడ్ ఇవ్వడం పట్ల ప్రేక్షకుల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
ముందు ఒక కథను ముగించి, తర్వాత ఇంకో కథకు లీడ్ ఇవ్వాలి కానీ… ఇలా మధ్యలో ఆపేయడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలి సినిమాను సంతృప్తికరంగా తీసి, సరైన ముగింపు ఇవ్వనపుడు.. ఇక రెండో భాగం మీద ప్రేక్షకులకు ఏం క్యూరియాసిటీ ఉంటుంది.. ఆ సినిమా చూడాలని ఎందుకు కోరుకుంటారు అనే వాదన వినిపిస్తోంది. పాన్ ఇండియా, పార్ట్-2 మోజులో కథలను దర్శకులు పక్కదోవ పట్టిస్తున్నారని.. ప్రేక్షకులకు ఇది తీవ్ర అసహనాన్ని కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందు ఒక కథను ప్రాపర్‌గా తీసి, దానికో ముగింపు ఇచ్చి.. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చాక రెండో భాగం కోసం కథను విస్తరించడం మీద మేకర్స్ దృష్టిపెట్టడం మంచిదన్న చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates