వీరమల్లు గాయం… OGతో మాయం

అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెట్టుకున్న ఓజి రంగంలోకి దిగింది. ఆగస్ట్ 2 మొదటి ఆడియో సింగల్ తో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టనుంది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు పలు ప్రత్యేకతలు ఉన్నాయట. ‘ఖుషి’ ఏ మేరా జహాలో హిందీ పదాలు ఎక్కువగా ఉన్నట్టు ఇప్పుడీ ఓజి టైటిల్ సాంగ్ లో ఇంగ్లీష్ లిరిక్స్ ని పొందుపరిచారని సమాచారం. గతంలో ‘తమ్ముడు’లో లుక్ ఏట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్ సాంగ్ తో రమణ గోగుల చేసిన ప్రయోగం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. అంతకు మించి అనేలా ఓజి ట్యూన్, లిరిక్స్ రెడీగా ఉన్నాయని తాజాగా వచ్చిన లీక్డ్ అప్డేట్.

పవన్ అభిమానులు బాగా అసహనంతో ఉన్నారు. ముందే ఊహించిందే అయినా హరిహర వీరమల్లు ఫలితం మరీ ఇంత అన్యాయంగా రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రీమియర్ల నుంచి మొదలైన నెగటివ్ టాక్ తర్వాత విఎఫెక్స్ లో మార్పులు చేసినా పెద్దగా మారలేదు. ఫ్లాప్ ముద్ర పడిపోయింది కానీ ఎంత స్థాయి అనేది ఇంకో వారం రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ గాయం మానాలంటే అది ఓజి చేతిలోనే ఉంది. సెప్టెంబర్ 25 విడుదల తేదీని పదే పదే నొక్కి చెబుతున్న డివివి ఎంటర్ టైన్మెంట్స్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. అఖండ 2 కూడా అదే పట్టుదల మీదుంది.

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు క్రేజీ బిజినెస్ జరగడం కొత్త కాదు. కానీ ఓజికి ఈసారి అంతకు మించి అనే స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఇంకా కొన్ని ఏరియాలకు నువ్వా నేనా అనే స్థాయిలో టాప్ డిస్ట్రిబ్యూటర్లు పోటీలో ఉండటంతో ఎవరికి ఫైనల్ చేయాలో అర్థం కాక దానయ్య వేచి చూసే ధోరణిలో ఉన్నారట. ఆగస్ట్ 2 రాబోయే సాంగ్ కనక ఛార్ట్ బస్టర్ అయితే పవన్ ఫ్యాన్స్ కి కొత్త ఎనర్జీ వస్తుంది. గతం గతః అనుకుంటూ ఓజి మేనియాలో పడిపోతారు. రిలీజ్ కు ఇంకో 55 రోజులే ఉన్న నేపథ్యంలో డివివి బృందం నాన్ స్టాప్ ప్రమోషన్లతో సోషల్ మీడియాని హోరెత్తించబోతోంది.