రెండు నెలల కిందట మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ అనే కొత్త పెళ్లికొడుకు మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురయ్యాడు. దీని వెనుక ఉన్నది భార్య, ఆమె ప్రియుడే అని వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఈ హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడీ ఉదంతం మీద సినిమా రాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
ఇందుకు హతుడు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తన సోదరుడి మృతి మీద సినిమా తీస్తే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది ప్రజలు తెలుసుకుంటారని రఘువంశీ సోదరుడు సచిన్ మీడియాకు తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని.. 80 శాతం రాజా రఘువంశీ స్వస్థలం ఇండోర్‌లో, మిగతా 20 శాతం హత్య జరిగిన మేఘాలయాలో తీస్తామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు ఆగాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నామని దర్శకుడు వెల్లడించాడు.
ఇండోర్‌లో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన రఘువంశీ.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. తన భార్య సోనమ్‌తో కలిసి కొన్ని రోజుల తర్వాత అతను మేఘాలయకు హనీమూన్ కోసమని వెళ్లాడు. రెండు రోజులకే అతను అక్కడ హత్యకు గురయ్యాడు. తనతో పాటు భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని.. తర్వాత అతణ్ని చంపేశారని.. తనను మాత్రం వదిలేశారని సోనమ్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. కానీ పోలీసులు లోతుగా విచారిస్తే.. తన ప్రియుడు, కొందరు సుపారీ కిల్లర్ల సాయంతో సోనమే.. భర్తను హత్య చేయించినట్లు వెల్లడైంది.
స్వయంగా సోనమ్ సోదరుడే తన చెల్లే భర్తను చంపించిందని.. ఆమెను ఉరి తీయాలని పేర్కొనడంతో జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మేఘాలయలోని కామాఖ్య అనే ఆలయంలో తనకు మొక్కు ఉందని.. అక్కడ పూజలు చేశాకే తనను తాకనిస్తానని భర్తకు షరతు పెట్టిన సోనమ్.. మొక్కు తీర్చుకునే నెపంతో ఆ ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ప్రియుడు, సుపారీ కిల్లర్లకు అతణ్ని అప్పగించిందని.. వాళ్లు హత్య చేస్తుంటే దగ్గరుండి చూసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates