‘అతడు’ని వదులుకున్న అందాల నటుడు

కొన్ని నోస్టాల్జియా ఫ్లాష్ బ్యాక్ లు ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా సినిమాలకు సంబంధించిన సంగతులు మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అతడుకి అలాంటి గతమే ఒకటుంది. వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ కాబోతున్న ఈ కల్ట్ క్లాసిక్ సంగతులు పంచుకోవడానికి నిర్మాత మురళి మోహన్  ఇవాళ హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. సరికొత్త సూపర్ 4కె టెక్నాలజీతో పాటు డాల్బీ అట్మోస్ సౌండ్ తో న్యూ ప్రింట్ ని సిద్ధం చేశారు. రీ రిలీజుల్లో రికార్డులన్నీ బద్దలు కొడుతుందనే ధీమా సూపర్ స్టార్ అభిమానుల్లో ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే అతడులో నాజర్ వేసిన తాత పాత్ర కథలో ఎంత కీలకమో తెలిసిందే. అయితే ముందీ క్యారెక్టర్ కి శోభన్ బాబుని అనుకున్నారు. అప్పటికే ఆయన సినిమాలు మానేసి చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. మురళిమోహన్ అడిగేందుకు మొహమాటపడి తనకు సన్నిహితుడైన మేకప్ మెన్ కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి అందాల నటుడి దగ్గరకు పంపారు. అయితే ఒక గ్లామర్ హీరోగా రిటైర్ అయిపోయిన తాను ఇప్పుడు తాత, తండ్రి లాంటి వేషాలు వేయలేనని మురళీమోహన్ కు ఫోన్ చేసి సున్నితంగా తిరస్కరించారు. అలా ఒక అరుదైన కాంబోకి శ్రీకారం చుట్టాలనుకున్నా కార్యాచరణ జరగలేదు.

సూపర్ స్టార్ కృష్ణ, అందాల నటుడు శోభన్ బాబు ఎన్నో మల్టీస్టారర్స్ లో నటించారు. మండే గుండెలు, ముందడుగు కమర్షియల్ గా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మహా సంగ్రామం తర్వాత మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. ఒకవేళ అతడు కనక శోభన్ బాబు ఒప్పుకుని ఉంటే ఒక రేర్ కాంబో అయ్యేది. అతడు రిలీజైన రెండు సంవత్సరాల తర్వాత శోభన్ బాబు ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. సినిమా చూశారో లేదో కానీ నాజర్ కు మాత్రం అది పెద్ద జాక్ పాట్ అయ్యింది. ఎస్పి బాలసుబ్రమణ్యంతో డబ్బింగ్ చెప్పించడం బాగా ప్లస్ గా నిలిచింది. అయినా రాసిపెట్టి ఉన్నప్పుడు ఎవరు మాత్రం తప్పించగలరు.