అవకాశాన్ని మిస్ చేసుకున్న ‘సార్ మేడమ్’

విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా రూపొందిన తలైవన్ తలైవి ఇవాళ తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. తెలుగులో సార్ మేడమ్ గా డబ్బింగ్ చేసి వారం కింద ట్రైలర్ కూడా విడుదల చేశారు. కానీ మన దగ్గర థియేటర్ వెర్షన్ రాలేదు. కారణం సింపుల్. హరిహర వీరమల్లుకి మొదటివారం అత్యధిక శాతం థియేటర్లు బ్లాక్ అయిపోయాయి. హోంబాలే ఫిలింస్ నిర్మాణం కావడం వల్ల యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహకు ఏపీ తెలంగాణలో మంచి రిలీజ్ దక్కింది. మల్టీప్లెక్సులు సైయారాకు సపోర్ట్ ఇస్తున్నాయి. ఇవి కాకుండా హాలీవుడ్ నుంచి ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ వచ్చింది.

ఇంత పోటీ మధ్య నలిగిపోవడం ఎందుకని సార్ మేడమ్ ని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు తమిళ రివ్యూస్ బయటికి వచ్చేశాయి. సినిమా కామెడీ, ఎమోషన్స్ తో మంచి ఎంటర్ టైనర్ గా ఉందని ప్రశంసలు కనిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి గత రెండు సినిమాలు విడుదల పార్ట్ 2,  ఏస్ కి రానంత మంచి ఓపెనింగ్ దీనికి వచ్చింది. మొదటి షో పడకముందే బుక్ మై షోలో అరవై వేల టికెట్లు అమ్ముడుపోవడం దానికి సాక్ష్యం. పాండిరాజ్ దర్శకత్వం, సంతోష్ నారాయణన్ సంగీతం, యోగిబాబు లాంటి ఆర్టిస్టుల కామెడీ వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. మరి సార్ మేడమ్ ని నెక్స్ట్ వీక్ తీసుకొస్తారేమో చూడాలి.

అయితే జూలై 31 విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఉంది. అదే వారంలో అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2 వస్తుంది. రెండు వారాలు గడవడం ఆలస్యం కూలి, వార్ 2 దిగుతాయి. సో సార్ మేడమ్ వస్తే నెక్స్ట్ వీక్ రావాలి. లేదంటే ఓటిటిలోనే చూడాల్సి ఉంటుంది. గతంలో ఇదే సమస్యతో టూరిస్ట్ ఫ్యామిలీ మన దగ్గర థియేటర్ రిలీజ్ దక్కించుకోకుండానే నేరుగా హాట్ స్టార్ లో చూడాల్సి వచ్చింది. ఇప్పుడు సార్ మేడమ్ కు ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ ఏదైతే అదయ్యిందని ఇవాళ రిలీజ్ చేసి ఉంటే మెల్లగా పికప్ అయిపోయి దాని రేంజ్ బిజినెస్ కు తగ్గట్టు ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యేదని ట్రేడ్ టాక్. ఏదైతేనేం ఛాన్స్ మిస్.