ఓజీ క్రేజ్.. వీరమల్లుకు లేకపోవడంపై పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఓజీ ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చివరికి జనసేనాని ఎన్నికల ప్రచారానికి వెళ్లినా సరే అవే నినాదాలు వినిపించాయి. కొన్నిసార్లు సందర్భం చూడకుండా అభిమానులు ‘ఓజీ ఓజీ’ అనడం చూసి పవన్ అసహనం చెందారు కూడా. పవన్ ఇంకో రెండు సినిమాలు చేస్తున్నా వాటి గురించి పట్టించుకోకుండా ‘ఓజీ’ కోసమే ఫ్యాన్స్ ఊగిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనిపై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నం సైతం ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 

ఐతే ‘ఓజీ’ టైటిల్ క్యాచీగా ఉంది కాబట్టి ఫ్యాన్స్ అరవడానికి ఒక కారణమని రత్నం విశ్లేషిస్తే.. దర్శకుడు జ్యోతికృష్ణ మాత్రం ‘ఓజీ’ యాక్షన్ మూవీ కావడం, దాని టీజర్ ఆకట్టుకోవడం వల్ల హైప్ పెరిగిందని పేర్కొన్నాడు. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే ఈ విషయంపై స్పందించారు. ‘ఓజీ’కి ఉన్న క్రేజ్.. మీరు నటించిన మిగతా రెండు చిత్రాలు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లకు లేకపోవడంపై ఏమంటారు అని అడిగితే ఆయన సమాధానం ఇచ్చారు. ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంటుందని.. ఐతే ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా హింసను ఇష్టపడుతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. 

ఒకప్పుడు హీరో అంటే మంచి వాడే అయి ఉండాలని, ధర్మాన్ని పాటించాలని అనుకునేవాళ్లని.. రాముడిని ఆదర్శంగా తీసుకునేవారని.. కానీ ఇప్పుడు అలా లేదని పవన్ అన్నారు. జనం నెగెటివ్ షేడ్స్‌ను ఎక్కువ ఇష్టపడుతున్నారని.. అలా ఉన్న పాత్రలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందని పవన్ చెప్పారు. ‘ఓజీ’ ప్రోమోలో వయొలెన్స్ ఎక్కువ కనిపించడం, క్యారెక్టర్లో కూడా గ్రే షేడ్స్ ఉండడం వల్ల ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతుండొచ్చన్నట్లు పవన్ మాట్లాడాడు. ఐతే ‘హరిహర వీరమల్లు’లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని.. దాని గురించి రిలీజ్ తర్వాత జనం ఎక్కువ మాట్లాడుకుంటారని.. ఆ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నానని పవన్ చెప్పారు.