‘వీరమల్లు’కు పారితోషకం తీసుకోని పవన్

పార్టీని నడపడం కోసం, కుటుంబం కోసమే రీమేక్ సినిమాలు చేశానంటూ ‘హరిహర వీరమల్లు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పి.. రీమేక్‌లు ఎందుకు అంటూ ప్రశ్నించేవాళ్లకు సమాధానం ఇచ్చాడు పవర్ స్టార్. ఐతే తన అవసరాల దృష్ట్యా చకచకా రీమేక్ సినిమాలు చేసి డబ్బులు సంపాదించిన పవన్.. అసవరమైతే అసలు పారితోషకమే తీసుకోకుండా కూడా నటిస్తాడనడానికి, సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడు అనడానికి ఉదాహరణ.. హరిహర వీరమల్లు. ఈ సినిమా ఆలస్యం కావడంతో బడ్జెట్ తడిసిమోపెడైన సంగతి తెలిసిందే. దీని వల్ల నిర్మాత ఏఎం రత్నం ఎంత ఇబ్బంది పడ్డారో, ఇప్పటికీ పడుతున్నారో అందరూ చూస్తున్నారు.

ఐతే ఇలాంటి టైంలో తమకు రావాల్సింది సెటిల్ చేసుకునే హీరోలే ఎక్కువమంది. కానీ పవన్ మాత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం కొన్నేళ్లుగా పని చేస్తున్నప్పటికీ పారితోషకం రూపంలో పైసా కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని విలేకరులతో చిట్‌చాట్‌లో ఆయన స్పష్టం చేశారు. ‘హరిహర వీరమల్లు’కు పారితోషకం తీసుకున్నారా, ఎంత తీసుకున్నారు అని అడిగితే.. ఇంకా ఏమీ తీసుకోలేదని పవన్ వెల్లడించారు. అలా అని తాను రెమ్యూనరేషన్ తీసుకోనని ఏమీ ఆయన చెప్పలేదు. సినిమా రిలీజ్ తర్వాత అంతా బాగుంటే.. పారితోషకం తీసుకుంటానన్నాడు.

తన అదృష్టమో, దురదృష్టమో కానీ.. చాలా సినిమాలకు తనకు రావాల్సిన డబ్బులు రావని పవన్ చెప్పాడు. తనకు నిర్మాతలంటే, ఆ సిస్టం అంటే ఎంతో గౌరవమని.. వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో.. ఒక సినిమా తీస్తున్నపుడు ఎంతమందికి సెటిల్ చేయాల్సి ఉంటుందో తనకు మొత్తం తెలుసని.. అందుకే నిర్మాతల శ్రేయస్సును తాను కోరుకుంటానని పవన్ చెప్పాడు. పవన్ గతంలో ‘జానీ’ సహా తన సినిమాలు కొన్ని ఫెయిలైనపుడు పారితోషకాలు వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

‘వీరమల్లు’ ఆలస్యం కావడానికి పవనే ప్రధాన కారణం అని అందరికీ తెలిసిందే. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో పవన్ వేగంగా ఈ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. వీలున్నపుడు డేట్లు ఇస్తూ వచ్చాడు. తన వల్ల ఆలస్యం అయి నిర్మాత రత్నం ఇబ్బందుల్లో పడ్డారు కాబట్టి.. ప్రస్తుతానికి ఆయన పారితోషకం ఏమీ తీసుకోకుండా సినిమా పూర్తి చేశారు. ప్రమోషన్లలోనూ పాల్గొంటున్నారు. సినిమా పెద్ద హిట్టయి రత్నంకు లాభాలు వస్తేనే పవన్‌కు పారితోషకం అందుతుందన్నమాట.