ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ మీడియా కెమెరాల ముందుకు తెగ వచ్చేస్తున్నారు. ఒకపక్క ఏపి డిప్యూటీ సిఎంగా ఎడతెగని బిజీలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ప్రమోషన్ల కోసం ఒక్కో ఛానల్ కోసం ఒక్కో కాస్ట్యూమ్ వేసుకుని మరీ సహకరించడం చూస్తే ఫాన్స్ ఆనందం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ఇవాళ మంగళగిరిలో జరిగిన సన్నివేశం ఇదే. హుడీ వేసుకుని ఖుషి రోజులను గుర్తు చేస్తూ పవన్ వచ్చిన విధానం జర్నలిస్టులను ఆశ్చర్యపరిచింది. ఆ మధ్య వైట్ అండ్ వైట్ ఖద్దరు బట్టలు వేసుకుని గిరిజన కొండల్లో, బురదలో నడిచింది ఈయనేనా అనే అనుమానం రావడం అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా పవన్ చాలా కబుర్లు పంచుకున్నారు.
ముఖ్యంగా ఇంతగా పబ్లిసిటీలో భాగం కావడం గురించి మరోసారి వివరించారు. హరిహర వీరమల్లు ఇంత ఆలస్యం కావడం వెనుక కరోనా లాంటి ప్రకృతి అడ్డంకులు ఎన్ని ఉన్నాయో రాజకీయాల వల్ల తన నుంచి ఏర్పడ్డ ఆటంకాలు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టాయి కాబట్టి తన వంతు బాధ్యతగా స్వయంగా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఇలా వచ్చానని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎమ్మెల్యేలు అడిగితే స్పెషల్ షో వేయిస్తానని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారున్న బిజీలో అయిదు నిమిషాల కంటే ఎక్కువ చూడలేరని, ఎలాగూ రోజు నన్ను చూస్తున్నారు కదాని చమత్కరించారు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిన కోణం ఒకటుంది. నటించడం వరకే మా పని, నిర్మాతలకెన్ని కష్టనష్టాలు వచ్చినా మాకు సంబంధం లేదని వ్యవహరించే కొందరు హీరోలు అన్ని భాషల్లో ఉన్నారు. డబ్బింగ్ వెర్షన్ రిలీజయ్యే పక్క రాష్ట్రంకు వెళ్లి మొహం చూపించాలన్నా అదేదో మహా పాపంలా ఫీలయ్యే వాళ్లకు కొదవ లేదు. కానీ పవన్ అలా ఆలోచించలేదు. పబ్లిక్ స్టేజి మీద నిధి అగర్వాల్ పడుతున్న కష్టం చూసి తనకు సిగ్గనిపించిందని చెప్పడం పవర్ స్టార్ కే చెల్లు. ఇక్కడితో అయిపోలేదు. మరో రెండు మూడు రోజులు పవన్ కళ్యాణ్ దర్శనం మీడియాకు, ఫ్యాన్స్ కు కొనసాగబోతోంది. కొత్తగా ఉంది కదూ.
Gulte Telugu Telugu Political and Movie News Updates