అవతార్-3… ట్రైలర్ వస్తోంది

ప్రపంచ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా ‘అవతార్’ పేరు ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 2009లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న ప్రపంచ సినిమా రికార్డులన్నింటినీ ఆ చిత్రం బద్దలు కొట్టేసింది. ఒక సినిమాకు ఇంతమందిని థియేటర్లకు రప్పించే సత్తా సినిమాకు ఉందా అనిపించేలా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందా చిత్రం. ఈ చిత్రం సాధించిన సంచలన విజయం చూసి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్.. దానికి నాలుగు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు. ఐతే 2022లో వచ్చిన ‘అవతార్’ తొలి సీక్వెల్ ‘ది వే ఆఫ్ వాటర్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

వసూళ్లకు ఢోకా లేకపోయినా.. సినిమా ఆశించినంత పెద్ద విజయం మాత్రం సాధించలేకపోయింది. ఐతే ‘అవతార్-3’ మాత్రం గొప్పగా ఉంటుందని ఊరిస్తూ వస్తున్నాడు కామెరూన్. ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ పేరుతో రూపొందిన ఈ చిత్రం.. ఈ ఏడాది డిసెంబరు 19న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. విడుదలకు ఐదు నెలల ముందే ‘అవతార్-3’కి కామెరూన్ ట్రైలర్ రెడీ చేసేయడం విశేషం. ఈ నెలలోనే ట్రైలర్ లాంచ్ కాబోతోంది.

ఇంకో మూడు రోజుల్లో, అంటే జులై 25న రిలీజ్ కానున్న ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు ‘అవతార్-3’ ట్రైలర్‌ను ఎటాచ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లు అన్నింట్లోనూ ‘అవతార్-3’ ట్రైలర్‌ను చూపిస్తారు. సినిమా ఆరంభానికి ముందే ఈ ట్రైలర్ ప్రదర్శితమవుతుందట. మరి ‘అవతార్-2’ను మించి సినిమా ఉంటుందా లేదా అన్నది ఈ ట్రైలర్ చూసి ఒక అంచనాకు వచ్చేయొచ్చు. రిలీజ్‌కు ఐదు నెలల ముందు ట్రైలర్ లాంచ్ చేయడం అంటే సాహసమే. ట్రైలర్ బాలేకుంటే.. సినిమాకు ప్రమోషన్ పరంగా అది మైనస్ కావచ్చు. కానీ ప్రోమో బాగుంటే మాత్రం హైప్ మరో స్థాయికి చేరొచ్చు. మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అవతార్-4 2029లో, అవతార్-4 2031లో రిలీజవుతాయని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.