పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో డేట్లు ఇచ్చి సినిమా చేసుకోమంటే అది ఏ నిర్మాత అయినా వరంగానే భావిస్తాడు. మిగతా నిర్మాతల్లా ఏ రీమేక్ కథ పట్టుకొచ్చి కొన్ని నెలల్లో సినిమా లాగించేసి ఉంటే మంచి లాభం చేసుకునేవారేమో. కానీ ఏఎం రత్నం మాత్రం పవన్‌తో భారీ బడ్జెట్ పెట్టి చారిత్రక నేపథ్యం ఉన్న హరిహర వీరమల్లు చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఈ సినిమా రకరకాల కారణాలతో బాగా ఆలస్యం అయింది. బడ్జెట్ తడిసి మోపెడైంది.
సినిమాను రిలీజ్ చేయడానికి ఆయన పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అన్ని అడ్డంకులనూ దాటుకుని ఈ శుక్రవారం వీరమల్లును ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు రత్నం. ఈ సినిమా విషయంలో రత్నం పడ్డ కష్టం ఎలాంటిదో స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఈ ప్రెస్ మీట్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రత్నం చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులను ఆలోచనలో పడేశాయి.
కొన్నేళ్లుగా పవన్ ఎక్కడికి వచ్చినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేయడం.. ఒక దశలో పవన్ సైతం దీనిపై అసహనం చెందడం తెలిసిందే. ఐతే ఓజీ కంటే ముందు మొదలైన హరిహర వీరమల్లు గురించి పవన్ ఫ్యాన్స్ ఎక్కడా మాట్లాడకపోవడం, నినాదాలు చేయకపోవడం తనను బాధించిన విషయాన్ని రత్నం ఈ సందర్భంగా పంచుకున్నారు.
”ఇప్పటి వరకు కళ్యాణ్ గారు కూడా హరిహర వీరమల్లు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆయన వేరే సినిమాల గురించి కూడా మాట్లాడలేదు అనుకోండి. కానీ ఫ్యాన్స్ ఆయన ఎక్కడికి వచ్చినా ఓజీ ఓజీ అని అరిచేవాళ్లు. అది షార్ట్, అట్రాక్టివ్ టైటిల్ కాబట్టి అందరూ ఓజీ.. ఓజీ అంటున్నారు, మాది హరిహర వీరమల్లు అనే పెద్ద టైటిల్ కాబట్టి అరవట్లేదు అనుకునేవాడిని.
కానీ వీరమల్లు నుంచి వీరా తీసుకుని వీరా వీరా అని అరవచ్చు కదా అని ఫీలయ్యేవాడిని కానీ ఎవరూ అలా అనలేదు. కానీ ఈ రోజు ఆయనే వచ్చి నా సినిమా గురించి చెప్పారు. కాబట్టి చాలా హ్యాపీ” అని రత్నం పేర్కొన్నారు. తన సినిమాకు సరైన ప్రమోషన్ దక్కట్లేదని, అభిమానులే ఓన్ చేసుకోలేదని రత్నం ఎంత ఫీలయ్యారో చెప్పడానికి ఈ మాటలే ఉదాహరణ. ఇక నుంచి అయినా ఫ్యాన్స్ ఈ సినిమాను తమ భుజాల మీద మోయాలని.. రత్నం పడ్డ కష్టానికి, అనుభవించిన బాధకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశిద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates