ఏ స్టార్ హీరో కూడా తాను మిగతా హీరోల కంటే తక్కువ అనుకోడు. ఒకవేళ అనుకున్నా బయటికి చెప్పడు. కానీ తాను అందరికీ భిన్నమని పవర్ పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పాడు. తన సినిమాల గురించి, తన స్టార్ ఇమేజ్ గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోని పవన్.. కొన్ని సందర్భాల్లో తనను తాను తక్కువ చేసుకునే మాట్లాడతాడు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రెస్ మీట్లో కూాడా ఆయన అదే తరహాలో మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల కంటే తన స్థాయి తక్కువ అని పవన్ వ్యాఖ్యానించడం విశేషం. తాను రాజకీయ నాయకుడిగా ఎక్కువ పాపులర్ కానీ.. సినిమా స్టార్‌గా అంత పెద్దవాడిని కాదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.
తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్లలో పాల్గొనడం తక్కువ అని.. ఐతే నిర్మాత ఏఎం రత్నం కష్టం చూసి ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్‌కు వచ్చానని పవన్ చెప్పారు. సినిమాలంటే తనకు అపారమైన గౌరవం, ఆసక్తి అని.. తన ప్రాణవాయువు సినిమానే అని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
‘‘నేను తిరిగి సినిమాలకు వెళ్లిపోయానని ప్రత్యర్థులు తిడుతున్నారు. కానీ సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను. మాట్లాడను. ఐతే సినిమా అంటే నాకు అపారమైన గౌరవం, ఆసక్తి.. అది నాకు ప్రాణ వాయువు. స్టోరీ టెల్లింగ్ అనేది ప్రతి మనిషికీ చాలా అవసరం. ఆ అవకాశం సినిమా మనకు కల్పిస్తుంది. ఈ సినిమా తీయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఏఎం రత్నం ఈ సినిమాను ముందకు తీసుకెళ్లారు.
నాకు రాజకీయంగా పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాల పరంగా చూస్తే మాత్రం చాలా మంది హీరోలతో పోలిస్తే నేను చాలా తక్కువ. మిగతా వాళ్ల సినిమాలకు అయినంత బిజినెస్ నా సినిమాలకు అవ్వదు. వాళ్లకు వచ్చినంత రెవెన్యూ నాకు రాకపోవచ్చు. నేను సినిమాల్లో పోటీ మీద ఎప్పుడూ అంత దృష్టిపెట్టలేదు. నేను సొసైటీ, రాజకీయాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. రత్నం గారి లాంటి నిర్మాతకు ఇబ్బందులు రాకూడదని నేను ఈ రోజు ప్రెస్ మీట్‌కు వచ్చాను. ఆయనకు ఏ ఇబ్బంది ఎదురైనా ఎవరి మీదా కోపం రాదు. కోప్పడొచ్చు కదా అంటే.. మౌనంగా ఉంటారు. ఆ మౌనమే నన్ను ఈ రోజు సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చేలా చేసింది’’ అని పవన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates