90 శాతం థియేట‌ర్ల‌లో వీర‌మ‌ల్లునే

చాన్నాళ్ల త‌ర్వాత తెలుగులో ఓ పెద్ద సినిమా రిలీజ‌వుతోంది. అందులోనూ అది ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అస‌లు పోటీ అన్న‌దే లేదు. ఇంకేముంది రిలీజ్ భారీగా ఉండ‌బోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేట‌ర్ల‌లో ఆ సినిమానే వేసేయ‌బోతున్నారు. 80-90 శాతం మ‌ధ్య థియేట‌ర్ల‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లునే క‌నిపిస్తే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. చిన్న టౌన్ల‌లో అయితే అందుబాటులో ఉన్న ప్ర‌తి థియేట‌ర్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లునే ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. తొలి రోజు అయితే 100 ప‌ర్సంట్ థియేట‌ర్ల‌లో ఆ సినిమాను మెజారిటీ షోలు ఆడించ‌బోతున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో మెగా హీరోల‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఆ హీరోల సినిమాల‌ను భారీగా రిలీజ్ చేస్తారు. వ‌సూళ్లు కూడా భారీగా ఉంటాయి. ప‌వ‌న్ సినిమాల‌కు భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయి. ఈ నేప‌థ్యంలోనే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లును అక్క‌డ పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో మొత్తం 150 థియేట‌ర్ల దాకా ఉంటే.. 135 థియేట‌ర్ల‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లును ప్ర‌ద‌ర్శించ‌బోతున్నార‌ట వ‌చ్చే వీకెండ్లో. ఆంధ్ర అంత‌టా ఇదే స్థాయిలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ కాబోతోంది. వీర‌మ‌ల్లుకు పోటీగా వ‌చ్చే వారం మరే సినిమా రిలీజ్ కావ‌ట్లేదు.

గ‌త వీకెండ్లో రిలీజైన జూనియ‌ర్, కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు చిత్రాలు ఆల్రెడీ వీక్ అయిపోయాయి. వ‌చ్చే వారానికి ఆ సినిమాలు థియేటర్ల నుంచి లేచిపోతాయి. ముందు వారాల్లో వ‌చ్చిన సినిమాలేవీ ఆ స‌మ‌యానికి నిల‌బ‌డే ప‌రిస్థితి లేదు. పెద్ద సిటీల్లో మ‌ల్టీప్లెక్సుల్లో ఎఫ్‌-1, సూప‌ర్ మ్యాన్, జురాసిక్ వ‌ర‌ల్డ్ లాంటి హాలీవుడ్ సినిమాల‌కు కొన్ని షోలు ఇవ్వ‌వ‌చ్చు. హిందీ చిత్రం సైయారాకు కొన్ని స్క్రీన్లు కేటాయించ‌వ‌చ్చు. వాటిని మిన‌హాయిస్తే మెజారిటీ స్క్రీన్లు, షోలు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకే సొంతం కాబోతున్నాయి. తెలంగాణ‌లో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక్క‌డ కూడా సినిమా భారీగానే రిలీజ్ కాబోతోంది. టికెట్ల ధ‌ర‌లు కూడా పెంచుతున్నారు కాబ‌ట్టి ఓపెనింగ్స్ భారీగా ఉండ‌డం ఖాయం.