సందీప్ రెడ్డికి బాలీవుడ్ దర్శకుడి సారీ

‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో సంచలనం సృష్టించాక.. అదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో తీసి అక్కడ మరింతగా ప్రకంపనలు రేపాడు సందీప్ రెడ్డి వంగ. ఇక తన చివరి చిత్రం ‘యానిమల్’తో అయితే బాలీవుడ్‌ను షేక్ చేసేశాడనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాలీవుడ్లో చాలామందికి నచ్చలేదు. జావెద్ అక్తర్ సహా అనేక మంది ఇండస్ట్రీ ప్రముఖులే ఆ సినిమా మీద యుద్ధం ప్రకటించారు. వాళ్లు లేవనెత్తిన అభ్యంతరాల మీద సందీప్ దీటుగానే స్పందించాడు. అతను అడిగిన ప్రశ్నలకు అటు వైపు నుంచి సమాధానమే లేకపోయింది. 

బాలీవుడ్ ప్రముఖులు, అలాగే అక్కడి మీడియా ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించేసరికి.. ఈ చిత్రాన్ని మెచ్చిన వాళ్లు కూడా బహిరంగంగా తన అభిప్రాయం చెప్పలేకపోయారు. అందులో తాను కూడా ఒకడిని అంటున్నాడు స్టార్ డైరెక్టర్ మోహిత్ సూరి. ‘ఆషిఖి-2’, ‘ఏక్ విలన్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన మోహిత్.. లేటెస్ట్‌గా ‘సైయారా’తో మరో పెద్ద హిట్ కొట్టాడు.

‘సైయారా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోహిత్.. సందీప్ మీద తన అభిమానాన్ని బయటపెట్టాడు. తాను అతడికి పెద్ద ఫ్యాన్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘యానిమల్’ సినిమా తనకు విపరీతంగా నచ్చిందని.. అందులో ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడి ముద్ర కనిపించిందని అన్నాడు మోహిత్. ఆ సినిమా చూశాక సందీప్‌కు తాను పర్సనల్‌గా మెసేజ్ పెట్టినట్లు అతను వెల్లడించాడు.

‘యానిమల్’ రిలీజైనపుడు సగం ప్రపంచం సందీప్‌కు వ్యతిరేకంగా మారిందని.. ఈ సినిమా నచ్చినవాళ్లు కూడా ఓపెన్‌గా దాన్ని ప్రశంసించలేకపోయారని అతను అభిప్రాయపడ్డాడు. తాను అప్పుడు సోషల్ మీడియా నుంచి బయటికి వచ్చేశానని.. అందుకే సందీప్‌కు పర్సనల్ మెసేజ్ పెట్టానని.. కానీ ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇవ్వకపోవడం తన తప్పే అని.. అందుకు సందీప్‌కు సారీ చెబుతున్నానని మోహిత్ అన్నాడు. సందీప్ ఎంతో నిజాయితీతో కూడిన వ్యక్తి అని.. చాలా జెన్యూన్‌గా, కన్విక్షన్‌తో సినిమాలు తీస్తాడని మోహిత్ కొనియాడాడు.