ట్రస్ట్ ది ప్రాసెస్… వీరమల్లు ట్రెండ్

కొన్నిసార్లు ఫ్యాన్స్ వేరే ఉద్దేశంతో చేసే సోషల్ మీడియా ట్రెండ్స్ ఇంకో ఫలితానికి దారి తీసి ఫైనల్ గా సినిమాకు మేలే చేస్తాయి. హరిహర వీరమల్లు విషయంలో అదే జరుగుతోంది. నిర్మాత ఏఎం రత్నం బిజినెస్ డీల్స్ లో బిజీగా ఉండటం, దర్శకుడు జ్యోతికృష్ణ చివరి దశ పనుల్లో తలమునకలై పోవడం లాంటి కారణాల వల్ల ప్రమోషన్లు అభిమానులు ఆశించిన స్థాయిలో లేవనేది కనిపిస్తున్న వాస్తవం. రిలీజ్ కేవలం ఇంకో ఆరు రోజుల్లో ఉంది కాబట్టి ఈ లాస్ట్ మినిట్స్ లో అగ్రెసివ్ పబ్లిసిటీ జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి తగ్గ జోష్ లేదని ట్రస్ట్ ది ప్రాసెస్ పేరుతో కొందరు మీమ్స్ తయారు చేసి వదిలారు.

పాల పాకెట్ల మీద పవన్ స్టిక్కర్లు అతికించినట్టు, నిత్యావసర వస్తువుల మీద వీరమల్లు లోగోలు వేసినట్టు ఇలా రకరకాలుగా స్వంతంగా ఏఐ టెక్నాలజీతో ఎడిటింగ్ చేసి దానికి ట్రస్ట్ ది ప్రాసెస్ అంటూ ట్యాగ్ తగిలించారు. ఇది కాస్తా బాగా వైరల్ అయిపోయింది. వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లిందంటే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఏకంగా విజయ మిల్క్ డైరీకి వెళ్లి నిజంగా పాల పాకెట్ల ప్రచారం కోసం వీరమల్లు టీమ్ ని కలిసిందా లేదా అని అడిగేసింది. ఫేక్ అని తెలిశాక వాటిని ఫ్యాన్స్ క్లారిటీ కోసం రిలీజ్ చేసింది. దీంతో స్వయంగా హరిహర వీరమల్లు ట్విట్టర్ హ్యాండిల్ స్పందిస్తూ ట్రస్ట్ ది ప్రాసెస్ అంటూ మెసేజ్ పెట్టేసింది.

దీన్ని బట్టి గంటల వ్యవధి ఈ టాపిక్ ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయినా పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్లు అక్కర్లేదనే కామెంట్స్ ఒకవైపు వినిపిస్తున్నా ఎంతో కొంత చేయాలని, ఇప్పుడు జరుగుతున్నది సరిపోవడం లేదని ఫ్యాన్స్ కంప్లయింట్. 21న హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పరిస్థితిలో అనూహ్యమైన మార్పులు రావొచ్చు. గ్రాండ్ ఓపెనింగ్స్ మీద ఎవరికీ సందేహాలు లేవు. ఎటొచ్చి ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తే రికార్డులకు పట్టపగ్గాలు ఉండవు. గాసిప్పుల సంగతి ఎలా ఉన్నా నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నట్టు బెస్ట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తే చాలు. పుష్పనే టార్గెట్ చేయొచ్చు.