సాయిపల్లవి సీతగా ఎలా మారిందంటే

నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో తీసే సినిమాలో తాను మెయిన్ లీడ్ అవుతానని బహుశా సాయిపల్లవి ఎప్పుడూ ఊహించి ఉండదు. బాలీవుడ్ రామాయణలో అవకాశం దక్కడం ఒకరకంగా లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పాలి. అయితే దర్శకుడు నితేశ్ తివారి బృందం దీని వెనుక పెద్ద కసరత్తే చేసింది. ముందు చాలా ఆప్షన్లు అనుకున్నారు. భారతీయ ప్రజల్లో సీతాదేవి పట్ల యెనలేని భక్తి భావం ఉంది. దాన్ని మరింత పెంపొందించే ఆర్టిస్టు అయితేనే గౌరవంగా ఉంటుందని భావించి వేట ముమ్మరం చేశారు. ఎలాంటి గ్లామర్ పాత్రలు చేయకుండా, సర్జరీలు చేయించుకోకుండా ఒరిజినాలిటీకి కట్టుబడిన సాయిపల్లవి కనిపించింది.

ఇంత కన్నా బెస్ట్ ఛాయస్ వేరేవరు కాలేరని భావించి ఆమెను ఎంచుకున్నారు. అంతకు ముందే ప్రేమమ్, విరాట పర్వం, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో తన నటన చూసిన నితేశ్ తివారి సాయిపల్లవికే ఓటు వేశారు. అలా రన్బీర్ కపూర్ పక్కన జోడిగా కేరళ కుట్టి ఫిక్స్ అయ్యింది. మాములుగా బాలీవుడ్ లో మల్లువుడ్ హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. తమిళ తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యం ఇస్తారు కానీ మలయాళం వైపు పెద్దగా చూడరు. అలాంటిది రామాయణ ఆఫర్ తలుపు తట్టి మరీ రావడం కన్నా అదృష్టం వేరే ఏముంటుంది. మొదటి భాగం షూటింగ్ ఆల్రెడీ పూర్తయిన సంగతి తెలిసిందే.

రామాయణ కనక వర్కౌట్ అయితే సాయిపల్లవి కెరీర్ లోనే అతి గొప్ప మలుపు అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ మూవీని దేశ దేశాలకు తీసుకెళ్లేందుకు పెద్ద ప్రణాళికలు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలిని మించి మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేక స్ట్రాటజీలు రెడీ అవుతున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు రావడం కన్నా సాయిపల్లవి కోరుకునేది ఏముంటుంది. పెర్ఫార్మన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. సీతగా చూపించే నటన విదేశీ విమర్శకులను మెప్పిస్తే చాలు ఆస్కార్ నామినేషన్లకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.