ఈ మధ్య టాలీవుడ్ కు కొత్త శుక్రవారాలు వస్తే పెద్దగా జోష్ లేదు. రిలీజులు కనిపిస్తుంటాయి కానీ థియేటర్లలో జనాలు ఉండరు. ఇంకో వారంలో హరిహర వీరమల్లు రాబోతున్న నేపథ్యంలో న్యూ ఫ్రైడేకి కిక్ ఇచ్చే సినిమాలు పెద్దగా లేకపోవడం ఎగ్జిబిటర్ల వెయిటింగ్ గేమ్ ని పొడిగిస్తోంది. ఉన్నంతలో ‘జూనియర్’ ఒకటే కొంచెం సౌండ్ చేస్తోంది. కొత్త కుర్రాడు కాబట్టి ఓపెనింగ్స్ తన మీద ఆధారపడటం లేదు. శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్, జెనీలియా, సెంథిల్ కుమార్ లాంటి పేర్లు మూవీ లవర్స్ ని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నాయి. కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు రాత్రే మీడియాకు ప్రీమియర్ వేయడం విశేషం.
రానా నిర్మించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’కి టాక్ చాలా కీలకం కానుంది. కేరాఫ్ కంచరపాలం తరహాలో మెల్లగా ఆడియన్స్ కి ఎక్కేస్తుందనే ధీమాతో టీమ్ ఉంది. పరుచూరి ప్రవీణ దర్శకత్వం గురించి ఇన్ సైడ్ టాక్ పాజిటివ్ గానే ఉంది. తమిళ డబ్బింగ్ ‘మై బేబీ’ విచిత్రంగా ఓటిటి రిలీజ్ కు ముందు రోజు థియేటర్లకు వస్తోంది. ఇది ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి. నాగ చైతన్య సమంతల రీ రిలీజ్ ‘ఏ మాయ చేశావే’ పెద్దగా మాయ చేస్తున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ లో ఒకటి రెండు షోలు మినహాయించి మిగిలిన సెంటర్స్ లో బుకింగ్స్ చెప్పుకోదగ్గట్టు లేవు. ప్రమోషన్లు చేయడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది.
ఫీడింగ్ లేకపోవడంతో కన్నడ సినిమా ‘ఎక్కా’ని ఒరిజినల్ వెర్షన్ తోనే ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. శివరాజ్ కుమార్ తమ్ముడి కొడుకు యువరాజ్ కుమార్ ఇందులో హీరో. బాలీవుడ్ సినిమాల్లో ‘సయారా’కు కొంచెం డీసెంట్ బుకింగ్స్ ఉండగా ‘నిఖితా రాయ్’తో పాటు ‘తన్వి ది గ్రేట్’ని పట్టించుకునేవాళ్ళు లేరు. హాలీవుడ్ మూవీ ‘స్మర్స్’ మీద బజ్ కూడా సోసోగానే ఉంది. జూనియర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఓకే. లేదంటే హరిహర వీరమల్లు వచ్చే దాకా టాలీవుడ్ కు ఈ వీరమౌనం తప్పదు. పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద సెలెబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates