మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలుపెడతారు. మహా అయితే రెండు వారాల ముందు. లేదా ఒక నెల. అంతకన్నా ముందస్తుగా ఆన్ లైన్ టికెట్లు అమ్మడం మనం ఎప్పుడూ చూడని ఏడో వింత, కానీ ప్రపంచ విఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ లెక్కకు అతీతంగా నిలుస్తున్నారు. ఆయన కొత్త మూవీ ఒడిస్సీ వచ్చే ఏడాది జూలై 17 విడుదల కానుంది. ఇంకా సంవత్సరం టైం ఉంది. అయినా సరే అప్పుడే బుకింగ్స్ మొదలుపెట్టేశారు. యుఎస్, యుకెలో ఉన్న ప్రముఖ ఐమ్యాక్స్ 70 ఎంఎం స్క్రీన్లలో టికెట్లన్నీ దాదాపు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇలాంటి క్రేజ్ అరుదు కదూ.
న్యూ యార్క్, సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ యంజిల్స్, డల్లాస్, ఫిలడెల్ఫియా, టోరెంటో, గ్రాండ్ రాపిడ్స్, లండన్, ప్రేగ్ తదితర ప్రాంతాలకు సంబంధించిన సేల్స్ అప్పుడే పీక్స్ కు చేరుకుంటున్నాయి. అసలు ఒడిస్సీ ఎలా ఉంటుందో పూర్తిగా అవగాహన లేకుండా ఇంతగా ప్రేక్షకులు ఎగబడుతున్నారంటే దానికి కారణం ఆయన మాస్టర్ స్టోరీ టెల్లింగ్. ఓపెన్ హెయిమర్ ని ఎగబడి చూసినా, ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన ఇంటర్ స్టెల్లార్ ని మళ్ళీ రిలీజ్ చేస్తే కోట్లు వసూలు చేసినా ఆయనకే చెల్లింది. కొందరికి నోలన్ టేకింగ్ అర్థం కాకపోయినా సరే కథ చెప్పే విధానానికి ఫిదా అయిపోయి మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు.
ఇంత హైప్ ఉందంటే ఒడిస్సీ వస్తున్న జూలై 17 ఇంకెవరు కాంపిటీషన్ లో ఉండకపోవడం ఉత్తమం. ఇతికాకు చెందిన గ్రీకు రాజు ఒడిస్సీస్ చేసిన ట్రోజన్ యుద్ధంతో పాటు ఆయన జీవిత ప్రయాణాన్ని నోలన్ కథాంశంగా ఎంచుకున్నాడు. 250 మిలియన్ డాలర్ల వ్యయంతో పూర్తి ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేస్తున్న ఒడిస్సీలో ఇప్పటిదాకా వరల్డ్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడని విజువల్స్ ఉంటాయట. షూటింగ్ పూర్తి చేసుకున్న ఒడిస్సీ పోస్ట్ ప్రొడక్షన్ కోసమే నెలల తరబడి వర్క్ చేస్తున్నారు నోలన్. ప్రపంచంలో ఇలా 365 రోజుల ముందే టికెట్లు అమ్ముడుపోయేలా చేసిన ఘనత నోలన్ కే దక్కుతుందేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates