హరిహర వీరమల్లు-2… 20 నిమిషాలు రెడీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, అత్యధిక కాలం మేకింగ్ దశలో ఉన్న చిత్రం.. హరిహర వీరమల్లు. ఆయన కెరీర్లో అత్యధిక సార్లు వాయిదా పడ్డ చిత్రం కూడా ఇదే. ఎట్టకేలకు ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిమానుల్లో ఇప్పటికీ కొంత సందేహాలు ఉన్నాయి కానీ.. నిర్మాత ఏఎం రత్నం అండ్ టీం మాత్రం ఈసారి రిలీజ్ పక్కా అనే అంటోంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్ల జోరు కూడా పెంచింది. ఇప్పుడు రిలీజ్ కాబోయేది ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 అన్న సంగతి తెలిసిందే. ఈ కథను మధ్యలో ఆపబోతున్నారు. పార్ట్-2 కూడా చేయాల్సి ఉంది. 

కానీ పార్ట్-1 మేకింగే చాలా ఆలస్యం అయింది. రిలీజ్ విషయంలోనూ ఎన్నో ఇబ్బందులు తప్పట్లేదు. అలాంటపుడు పార్ట్-2 నిజంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి. కానీ రెండో భాగం కూడా కచ్చితంగా ఉంటుందని అంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఇప్పటికే దానికి సంబంధించి కొంత చిత్రీకరణ కూడా పూర్తయినట్లు ఆమె వెల్లడించడం విశేషం. హరిహర వీరమల్లు-2కు సంబంధించి 20 నిమిషాల నిడివితో ఇప్పటికే సన్నివేశాలు తీసినట్లు నిధి తెలిపింది. పార్ట్-1 విడుదలైన కొన్ని రోజులకు రెండో భాగం చిత్రీకరణ మొదలుపెడతామని కూడా ఆమె చెప్పింది. 

ఈ సినిమా మేకింగ్ దశలో ఎన్నో రూమర్లు వచ్చాయని.. కానీ ట్రైలర్ వచ్చాక అన్నింటికీ తెరపడిందని.. ఒక విజువల్ వండర్‌గా ‘హరిహర వీరమల్లు’ ఉంటుందని.. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నిధి తెలిపింది. పవన్ కళ్యాణ్ నటనకు పరిమితం కాకుండా ఈ సినిమాకు సంబంధించి ప్రతి విభాగంలోనూ ఇన్వాల్వ్ అయ్యారని.. డైలాగ్స్, పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లకు సంబంధించి ఆయన కీలకమైన సలహాలు ఇచ్చారని నిధి తెలిపింది.