వినోదం కోసం సినిమాలు చూసే ప్రేక్షకులు వాటి వెనుక జరుగుతున్న కష్టాలను చూసేందుకు ఇష్టపడరు. వంద రూపాయల టికెట్ కు తగ్గ ఎంటర్ టైన్మెంట్ దొరికిందా లేదానేది తప్ప 24 క్రాఫ్ట్స్ చేసిన యజ్ఞం లాంటి షూటింగ్ వాళ్లకు అనవసరం. ఇది తప్పేం కాదు. ఎందుకంటే రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసినప్పుడు రేట్ కు తగ్గ టేస్ట్ ముఖ్యం కానీ హోటల్ ఓనర్ ఆర్ధిక పరిస్థితి, లాభ నష్టాలు మనం పట్టించుకోము. అందుకే ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఆదరణకు నోచుకున్న సందర్భాలు తక్కువ. రవితేజ నేనింతే ఎంత రియలిస్టిక్ గా ఉన్నా కేవలం ఈ కారణంగానే ఫెయిల్యూర్ గా నిలిచింది.
అంతకు ముందు దశాబ్దాల క్రితం దాసరి గారు అద్దాల మేడ, శివరంజనిలాంటి వాటితో హిట్లు కొట్టారు కానీ ఇప్పటి డైరెక్టర్లు అలాంటి సాహసాలు చేయడం లేదు. కానీ సితార సంస్థ ఒకేసారి రెండు రిస్కులకు పూనుకుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందబోయే బ్యాడ్ యాస్ పరిశ్రమ నేపథ్యంలో ఉంటుంది. ఒక మాములు మనిషి పెద్ద సినిమా స్టార్ అయ్యాక జరిగే పరిణామాలను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. విశ్వక్ సేన్ ఫంకీలో నేరుగా టాలీవుడ్ మీద సెటైర్లు ఉంటాయి. ఇందులో హీరో పాత్ర ఒక దర్శకుడు. పంచులు, కౌంటర్లతో అనుదీప్ కామెడీ ఓ రేంజ్ లో పండబోతోంది.
ఇదంతా నిర్మాత నాగవంశీ ఇటీవలే మా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కష్టాన్ని కష్టంగా చూపిస్తే ఆడియన్స్ నో అంటారు కానీ సరదాగా చూపిస్తే ఎంజాయ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతానికి ఫంకీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ ఈ సంవత్సరమే ఉంటుంది. బ్యాడ్ యాస్ వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈ నేపథ్యంలో సినిమాలు తీయడం ఒకరకంగా రిస్క్ అయినప్పటికీ కొత్త కంటెంట్ కోసం ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. లైలా తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన విశ్వక్ సేన్ నేరుగా ఫంకీ ప్రమోషన్లలోనే కనిపిస్తాడట. సిద్దు అక్టోబర్ లో తెలుసు కదాతో పలకరించబోతున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates