దళపతి పోలిక చాలా పెద్ద అవార్డు

ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలి పట్ల ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అంతకంతా పెరిగిపోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేని ఒక కమర్షియల్ మూవీకి ఈ స్థాయిలో బజ్ రావడమంటే మాములు విషయం కాదు. క్రెడిట్ మొత్తం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు దక్కుతుంది. తాజాగా డబ్బింగ్ పూర్తి చేసిన రజనీకాంత్ సినిమా అయిపోగానే తనకు దళపతి గుర్తుకు వచ్చిందని ప్రశంసలు గుప్పించడం ఏ డైరెక్టర్ కైనా నేషనల్ అవార్డు కన్నా ఎక్కువ. ఎందుకంటే సూపర్ స్టార్ గతంలో ఏ మూవీని ఇలా ఐకానిక్ క్లాసిక్ తో పోల్చిన దాఖలాలు లేవు. ప్రత్యేకంగా కూలీకి మాత్రమే ఆ అర్హతను ఆపాదించారు.

అంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే 1992లో రిలీజైన దళపతి ఒక మాస్టర్ పీస్. రజనీకాంత్ మణిరత్నం కలయికలో వచ్చిన ఒకే ఒక వండర్. దుర్యోధన, కర్ణుడి స్నేహాన్ని మోడరన్ గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఆపాదించి, దానికి కుంతీదేవి మదర్ సెంటిమెంట్ జోడించిన తీరు విమర్శకులతో చప్పట్లు కొట్టించుకుంది. పేరుకు మహాభారతం స్ఫూర్తిగా అనిపిస్తుంది కానీ అంతర్లీనంగా మణిరత్నం పండించిన డ్రామా, రజని, మమ్ముట్టి, అరవింద్ స్వామి, శోభన, భానుప్రియ, అమ్రిష్ పూరి నటన దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇళయరాజా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అలాంటి చరిత్ర ఉన్న దళపతితో కూలిని పోల్చడమంటే లోకేష్ టాలెంటే. నిజానికి ఇతను తలైవా కోసం రాసుకున్న కథ ఇది కాదు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వేరేది అనుకున్నాడు. కానీ పలు కారణాల వల్ల ఇది కాస్తా కూలిగా మారింది. ఎలాంటి సబ్జెక్టు అయినా లార్జర్ తాన్ లైఫ్ అనిపించే రజనీకాంత్ లాంటి హీరో దొరికినప్పుడు ఎలివేషన్లు ఆటోమేటిక్ గా వస్తాయని, నా వరకు నేను నాకు ఇష్టమైన దళపతి స్థాయిలో ఒక సినిమా తీయాలనే లక్ష్యంతో దీనికి పని చేశానని లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు. నిజంగా అంత స్థాయిలో కూలి కంటెంట్ ఉందో లేదో ఆగస్ట్ 2 కూలి ట్రైలర్ ద్వారా శాంపిల్స్ చూసేయొచ్చు.