తమిళంలో కొంచెం లేటుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో శిలంబరసన్ అలియాస్ శింబు. టాలెంటుకు లోటు లేకపోయినా.. ఒకప్పుడు సరైన సినిమాలు చేయక, వ్యక్తిగత వివాదాలతో కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు ఈ హీరో. కానీ కొన్నేళ్ల నుంచి అతను సిన్సియర్‌గా సినిమాలు చేస్తున్నాడు. నిలకడగా హిట్లు కొడుతున్నాడు. మణిరత్నం, గౌతమ్ మీనన్ లాంటి మేటి దర్శకులు తనతో వరుసగా సినిమాలు చేశారంటే తన ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు. మణిరత్నం-కమల్ హాసన్‌ల కొత్త చిత్రం థగ్ లైఫ్‌లోనూ అతను కీలక పాత్ర చేశాడు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. శింబు పెర్ఫామెన్స్ మాత్రం ప్రశంసలందుకుంది.
ఇప్పుడతను ఈ తరం మేటి తమిళ దర్శకుల్లో ఒకడైన వెట్రిమారన్‌తో జట్టు కట్టబోతున్నాడు. పొల్లాదనవ్ దగ్గర్నుంచి విడుదల వరకు వెట్రిమారన్ తీసిన సినిమాలన్నీ కల్ట్ మూవీసే. ఇప్పుడతను శింబు హీరోగా ఓ సినిమాను అతి త్వరలో మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం శింబు కేవలం పది రోజుల్లో పది కిలోల బరువు తగ్గడం విశేషం. థగ్ లైఫ్‌లో శింబు నాజూగ్గానే కనిపించాడు. బరువు ఎక్కువేమీ లేడు. నిజానికి ఒకప్పుడు అతను బొద్దుగా ఉండేవాడు. సినిమాల మీద సీరియస్‌నెస్ పెరిగాక బరువు తగ్గి మంచి లుక్‌లోకి మారాడు. కొన్నేళ్లుగా లీన్ లుక్‌లోనే కనిపిస్తున్నాడు.
అయినా సరే.. వెట్రిమారన్ సినిమా కోసం ఇంకా పది కిలోలు తగ్గాడు అంటే.. ఈ పాత్ర ఆమేరకు డిమాండ్ చేసిందన్నమాట. వెట్రిమారన్ తీయబోయేది ధనుష్‌తో ఇంతకుముందు చేసిన వడ చెన్నై బ్యాక్ డ్రాప్ సినిమానే. ధనుష్‌తోనే వడ చెన్నై సీక్వెల్ తీయాలనుకున్నాడు కానీ కుదరలేదు. ఇప్పుడు అదే ప్రపంచంలో వేరే కథతో శింబు హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఇందుకోసం వడ చెన్నై నిర్మాత ధనుష్ నుంచి రైట్స్ కూడా తీసుకున్నాడు. ధనుష్ లాగే బక్కగా కనిపించాల్సిన పాత్ర ఏమో.. అందుకే శింబు మరింత బరువు తగ్గి ఉండొచ్చు. ఈ చిత్రంతో జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక పాత్ర చేయబోతుండడం విశేషం. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates