ఆంధ్ర భోజుడిగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీకృష్ణ దేవరాయలు పేరు వినని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన గొప్ప కీర్తి ఆయనది. సినిమాల వరకు చూసుకుంటే ఆదిత్య 369లో బాలకృష్ణ ఆ పాత్రను పోషించిన తీరు నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఉంటుంది. అంతకు ముందు స్వర్గీయ ఎన్టీఆర్ మహామంత్రి తిమ్మరుసులో ఈ క్యారెక్టర్ కు ప్రాణ ప్రతిష్ఠ చేయడం గొప్పగా పండింది. ఆ తర్వాత రాయలవారిగా కనిపించే సాహసం ఎవరూ చేయలేదు. ఆ మధ్య శ్రీకాంత్ దేవరాయ పేరుతో ట్రై చేశాడు కానీ బాక్సాఫీస్ దగ్గర చేదు ఫలితం అందుకున్నాడు.
ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నాలు జరగబోతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు కాంతారా హీరో రిషబ్ శెట్టిని శ్రీ కృష్ణదేవరాయలుగా చూడొచ్చని తెలిసింది. బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నట్టు ముంబై అప్డేట్. లగాన్, జోధా అక్బర్ లాంటి ఆల్ టైం క్లాసిక్స్ ఇచ్చిన ఈ కల్ట్ డైరెక్టర్ చాలా కాలంగా డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ లో నటించారు కానీ పెద్దగా ఇంపాక్ట్ రాలేదు. తిరిగి దర్శకత్వ బాధ్యతలు తీసుకునే దిశగా ఆలోచించలేదు. ఇప్పుడు రిషబ్ శెట్టి కోసం మెగా ఫోన్ చేపట్టడం మంచి విషయమే కానీ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
ఇక రిషబ్ శెట్టి జాతకం మాములుగా లేదు. ఒకపక్క కాంతారా చాప్టర్ 1 మీద అంచనాలు ఎక్కడికో వెళ్లపోతున్నాయి. జై హనుమాన్ లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ తనకే దక్కింది. బాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందే ఛత్రపతి శివాజీ మహారాజ్ గా మరో ఎక్స్ ట్రాడినరి రోల్ దక్కింది. ఇలా కమర్షియల్ వాసనలు లేకుండా ఎప్పటికీ చెప్పుకునే గొప్ప క్యారెక్టర్లు రిషబ్ శెట్టికే దక్కడం చూస్తే ఇతర హీరోలకు ఈర్ష కలగడం సహజం. ఇంకో నాలుగేళ్ల దాకా ఇతను దొరికే పరిస్థితి లేదట. ఒకవేళ శ్రీకృష్ణదేవరాయలుగా నటించడం నిజమైతే మాత్రం ఏపీ తెలంగాణతో పాటు స్వంత్ర రాష్ట్రమైన కర్ణాటకలో దీనికి విపరీతమైన బజ్ వచ్చేస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates