2000 తర్వాత సౌత్ ఇండియన్ సినిమాల్లో లవర్ బాయ్ అనే మాట ఎక్కువగా వాడింది మాధవన్‌కే అంటే అతిశయోక్తి కాదు. తొలి చిత్రం అలై పాయుదే (తెలుగులో సఖి)తో అతను అమ్మాయిల మనసు దోచేశాడు. యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన అతను ఆ తర్వాత చాలా లవ్ స్టోరీల్లో నటించాడు. అందులో చాలా వరకు విజయవంతం అయ్యాయి. వయసు పెరిగాక మాధవన్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్‌ను పొడిగించుకున్నాడు. ఈ మధ్య మాధవన్ నెగెటివ్ రోల్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే లేటు వసయులోనూ ఆయన తాజాగా ఆప్ జసా కోయి అనే రొమాంటిక్ మూవీలో నటించాడు. ఇందులో తన కంటే వయసులో చాలా చిన్నదైన ఫాతిమా సనా షేక్‌తో రొమాన్స్ చేశాడు. దీని మీద విమర్శలు కూడా వచ్చాయి. ముందు ఈ విమర్శలను మాధవన్ తేలిగ్గానే తీసుకున్నట్లు కనిపించాడు. కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారింది. ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశాడు మాధవన్.
ఆప్ జైసా కోయి సినిమా మొదలుపెట్టినపుడు తాను ఇంకా రొమాంటిక్ సినిమాలు చేయగలను అనే భావనలోనే ఉన్నాడట మాధవన్. అందుకే తనకు వయసు పెరిగినా సరే ఈ సినిమా చేయడానికి అంగీకరించాడట.
కానీ ఇకపై మాత్రం తన వయసుకు తగ్గ పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నట్లు మాధవన్ తెలిపాడు. ఇకపై రొమాంటిక్ సినిమాలను పూర్తిగా వదిలేస్తానేమో అనిపిస్తోందని.. చివరి చిత్రంగా ఆప్ జైసా కోయిలో నటించానని అనుకుంటున్నట్లు మాధవన్ తెలిపాడు. ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసే మాధవన్.. ఆప్ జైసా కోయిలోనూ క్యారెక్టర్‌కు తగ్గట్లే నటించాడు. ఫాతిమాతో ఆయన కెమిస్ట్రీ బాగానే పండిందనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం ఈ వయసులో యంగ్ హీరోయిన్‌తో రొమాన్స్ ఏంటి అని కామెంట్లు చేశారు. అవి మాధవన్‌ను బాగానే హర్ట్ చేసినట్లున్నాయి. అందుకే ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నట్లున్నాడు ఈ మాజీ లవర్ బాయ్.
Gulte Telugu Telugu Political and Movie News Updates