మాములుగా హీరోలు డ్యూయల్ రోల్ చేస్తేనే ప్రేక్షకులు ప్రత్యేకమైన థ్రిల్ అనిపిస్తుంది. అలాంటిది ట్రిపుల్ రోల్ అంటే ఏ స్థాయిలో కిక్ ఇస్తుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ జై లవకుశ, అమిగోస్ ద్వారా చేసి చూపించారు. ఈ లిస్టులో అల్లు అర్జున్ చేరబోతున్నాడనేది కొత్త న్యూస్ కాకపోయినా ఇప్పుడో ట్విస్టు వచ్చి చేరింది. ముంబై వర్గాల టాక్ ప్రకారం బన్నీ రెండు మూడు కాదు ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇది నిజంగా అభిమానులకు షాక్ ఇచ్చే రిపోర్ట్. అయితే దీని వెనుక పెద్ద కసరత్తు జరిగింది. అదేంటో చూద్దాం.
అట్లీ దర్శకత్వం వహించే ఈ మూవీలో హీరో ఫ్యామిలీకి సంబంధించి మొత్తం నాలుగు క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి తాత, మరొకటి తండ్రి, ఇంకో ఇద్దరు కొడుకులు. అందరికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ముందు వేరే ఆర్టిస్టులను అనుకున్నప్పటికీ ఒకసారి ట్రై చేద్దామని బన్నీ మీద అన్నీ గెటప్స్ తో లుక్ టెస్ట్ చేశారట. అవి బ్రహ్మాండంగా ఉన్నాయని యూనిట్ సభ్యులు అభిప్రాయపడటంతో అట్లీ, అల్లు అర్జున్ ఇద్దరూ ఓకే అనుకున్నారని వినికిడి. అదే జరిగితే అప్పుడెప్పుడో స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఇన్ని పాత్రలు ఒకే సినిమాలో చేసిన ఘనత బన్నీకే దక్కుతుంది. ఇదంతా అధికారికంగా ధృవీకరణ కాలేదు.
పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని నిలబెట్టుకునే కసితో ఉన్న అల్లు అర్జున్ ఎలాంటి రిస్కుకైనా సై అంటున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. హీరోయిన్లుగా దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఖరారు కాగా భాగ్యశ్రీ బోర్సే, రష్మిక మందన్నలు దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని అంటున్నారు. ఇంత గ్లామర్ కోటింగ్ ఉన్న స్టార్ సినిమా గత కొన్నేళ్లలో రాలేదనే చెప్పాలి. శ్రీలీల కూడా ఉంటే ఒక పనైపోయేది కానీ ఆ స్కోప్ లేదు కాబోలు. 2027 విడుదలను టార్గెట్ గా పెట్టుకున్న అట్లీ వచ్చే ఏడాది ద్వితీయార్థంలోగా షూటింగ్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates