బాలీవుడ్ లో సెన్సేషన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న దర్శక నిర్మాతలు పెరిగిపోతున్నారు. ఇవాళ విడుదల కావాల్సిన ఉదయ్ పూర్ ఫైల్స్ ఆగిపోయింది. దీని మీద సెన్సార్ బోర్డు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏకంగా 150 కట్లను సూచించడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిలించే విషంగా ఇందులో సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయనేది అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరం. దీని రిలీజ్ గురించి కేంద్రానికి వారం గడువు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటీషన్ వేసిన జర్నలిస్ట్ ప్రశాంత్ టాండన్, జఊఏహింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ వాదనలను పరిగణనలోకి తీసుకుంది.
అసలు ఇంతగా కాంట్రావర్సి ఏముందో చూద్దాం. 2022 ఉదయ్ పూర్ నగరంలో టైలర్ వృత్తి చేసుకునే కన్హయ్య లాల్ పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో అతను పోస్ట్ పెట్టడమే దీనికి కారణం. రియాజ్ అక్తర్, గౌస్ మహమ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడటమే కాకుండా క్రూరంగా గొంతు కోసి చంపడాన్ని వీడియో తీసి విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కత్తిని ఎదురు కోవాల్సి ఉంటుందని అందులో హెచ్చరించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా నిందితులను పట్టుకుని జైలుకు తరలించారు.
ఇదంతా ఉదయ్ పూర్ ఫైల్స్ లో చూపించారు. హంతకులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, దానికి ప్రేరేపించబడిన కారణాలు, ప్రవక్తను ఉద్దేశించి నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ అన్ని ఇందులో పెట్టేశారు. దర్శకుడు భరత్ ఎస్ శ్రీనేట్ తన ప్రయత్నాన్ని సమర్ధించుకున్నారు. ఇది కేవలం భావజాలాలు చూపించే ప్రయత్నమని, ఏ మతాన్ని కించపరచలేదని అంటున్నారు. కన్హయ్య లాల్ పాత్రను ప్రముఖ నటుడు విజయ్ రాజ్ పోషించాడు. ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలో కాంట్రవర్సి టాపిక్ తీసుకున్న ఉదయ్ పూర్ ఫైల్స్ టైటిల్ ని అదే తరహాలో పెట్టడం గమనించాల్సిన విషయం. ఫైనల్ గా రూట్ క్లియరవుతుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates