మనకున్న గొప్ప పురాణ గాథల్లో ఒకటైన ‘రామాయణం’ మీద వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో అద్భుతమైన చిత్రాలను అందించారు ముందు తరం దర్శకులు. ఈ తరం ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యే ఆ కథను తీసుకుని ఓం రౌత్, ప్రభాస్ కలిసి సినిమా చేస్తుంటే అమితాసక్తి వ్యక్తమైంది. కానీ వీరి కలయికలో వచ్చిన ‘ఆదిపురుష్’ ఒక చేదు జ్ఞాపకంగా మారింది. గొప్ప కథను చెడగొట్టారంటూ తీవ్ర విమర్శలే ఎదుర్కొంది ‘ఆదిపురుష్’ టీం. ఐతే ఆ సినిమా తెరకెక్కుతుండగానే.. రామాయణం మీద మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. కొన్నేళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ పనులు చేశాక.. గత ఏడాదే ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లారు. నేరుగా ‘రామాయణం’ అనే పేరు పెట్టే ఈ సినిమా తీస్తున్నారు.
ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ‘రామాయణం’ ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. రామాయణం ప్రధాన పాత్రధారుల పాత్రల్లో అమితాసక్తి రేకెత్తిస్తున్నది రావణుడి పాత్రే. బేసిగ్గానే ఆ పాత్ర క్యూరియస్‌గా అనిపిస్తుంది. పైగా ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించిన యశ్ ఆ పాత్రను చేస్తుండడంతో దీని కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఈ పాత్రకు పర్ఫెక్ట్ కాస్టింగ్ అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ పాత్ర మీద మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుని ‘రామాయణం: పార్ట్-1’ చూడడానికి వెళ్తే నిరాశ తప్పదన్నది చిత్ర వర్గాల సమాచారం. వచ్చే దీపావళికి రిలీజ్ కానున్న రామాయణం-1లో రావణుడి పాత్ర 15 నిమిషాలు మాత్రమే ఉంటుందట. తొలి భాగంలో రాముడు, సీతల పుట్టుకతో మొదలుపెట్టి.. వారి పెళ్లి, అరణ్య వాసం వరకు చూపిస్తారట. సినిమా చివర్లో రావణుడి పాత్రను ప్రవేశ పెట్టి సీతను ఎత్తుకు పోయే సన్నివేశం దగ్గర పార్ట్-1ను ముగిస్తారట. రెండో భాగం అంతా యుద్ధ ప్రధానంగా సాగుతుందని హిందీ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ వార్తలపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. సెకండ్ పార్ట్ 2027లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates