కీర్తీ.. ఇది కదా కావాల్సింది

‘మహానటి’తో కీర్తి సురేష్‌కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు తనను ఎంపిక చేసినపుడు పెదవి విరిచినవాళ్లందరూ.. సినిమా చూశాక లెంపలేసుకున్నారు. జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగిపోయేలా చేసింది కీర్తి. కానీ ఆ సినిమాతో వచ్చిన పేరును ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ‘మహానటి’ తర్వాత కీర్తి హీరోల పక్కన నటించిన సినిమాలు.. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. ఏవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు పూర్తిగా తేలిపోయాయి. ఆ చిత్రాల్లో తన పాత్రలు కీర్తి జడ్జిమెంట్ స్కిల్స్‌ను ప్రశ్నార్థకం చేశాయి. ‘మహానటి’ అనుకోకుండా కీర్తికి కీర్తి తెచ్చిపెట్టింది కానీ.. ఆమె సొంత ప్రతిభ ఏముందనే అభిప్రాయాలు కలుగజేశాయి తర్వాతి సినిమాలు. ఇంకో సినిమా తేడా కొడితే కీర్తికి కొత్తగా వచ్చిన ఇమేజ్ అంతా పోయి.. ఆమె పూర్వపు స్థితికి చేరడం ఖాయం అనిపించింది.

ఇలాంటి సమయంలో కీర్తి కొత్త సినిమా ‘సాని కాయిదం’ (రఫ్ పేపర్ అని అర్థం) ఫస్ట్ లుక్ రిలీజైంది. అందులో కీర్తిని చూసి షాకైపోయారు ఒక్కొక్కరు. ‘దండుపాళ్యం’ సినిమాను తలపించేలా చాలా వయొలెంట్‌గా కనిపించింది ఫస్ట్ లుక్. ఈ చిత్రంతో విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడిగా మారడం విశేషం. ఇటు కీర్తి, అటు సెల్వ ఇద్దరూ షాకింగ్ లుక్స్‌తో ఆశ్చర్యపరిచారు. వాళ్లిద్దరూ హంతకుల పాత్రలు చేయబోతున్నారన్నది స్పష్టం.

రగ్డ్ లుక్స్‌తో ఇద్దరూ వావ్ అనిపించి సినిమా మీద ఆసక్తిని పెంచారు. ‘మహానటి’ తర్వాత కీర్తి నుంచి ప్రేక్షకులు కోరుకున్నది ఇలాంటి వైవిధ్యమే. కచ్చితంగా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందనిపిస్తోంది. ఇక ముందూ కీర్తి ఇలాంటి కొత్త ప్రయత్నాలేమైనా చేయాలి తప్ప.. పెంగ్విన్‌లు, మిస్ ఇండియాల జోలికి వెళ్లడం మానేస్తే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఫస్ట్ లుక్‌తో ఆశ్చర్యపరిచిన కీర్తి.. సినిమాతో ఎలా షాకిస్తుందో చూడాలి.