విషాదం – ఎంఎం కీరవాణి తండ్రి నిర్యాణం

ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా కన్నుమూశారు. ఇప్పటి తరానికి ఈ కోణంలోనే పరిచయం ఉన్నప్పటికీ శివశక్తి దత్తా వెనుక బలమైన నేపథ్యం ఉంది. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8 జన్మించారు. రాజమౌళికి స్వయానా పెదనాన్న. అంటే రచయిత విజయేంద్ర ప్రసాద్ కు అన్నయ్య. శివశక్తి దత్తా స్వస్థలం రాజమండ్రి దగ్గరున్న కోవూరు. చిన్నతనంలోనే వీళ్లది పెద్ద కుటుంబం. తండ్రి విజయ అప్పారావు గారు భూస్వామి, కాంట్రాక్టర్. అప్పట్లోనే పన్నెండు బస్సులతో ట్రాన్స్ పోర్ట్ కంపెనీ నడిపేవారు. శివశక్తిదత్తా రెండో సంతానం.

ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్ మీడియట్ చదువుకున్న శివశక్తి దత్తా మధ్యలోనే చదువు ఆపేసి ముంబై జెజె స్కూల్ అఫ్ ఆర్ట్స్ లో చేరిపోయారు. అక్కడే డిప్లమా అందుకుని తిరిగి స్వంత ఊరు వచ్చారు. ఇదంతా రెండు సంవత్సరాల కాలంలో జరిగింది. కమలేష్ అనే కలం పేరుతో శివశక్తి దత్తా చేసే రచనలు పత్రికల్లో వచ్చేవి. తర్వాత చెన్నై వెళ్ళిపోయి కొందరు దర్శకుల దగ్గర సహాయకుడిగా పని చేశారు. పిల్లనగ్రోవి అనే సినిమా తీయాలని మొదలుపెట్టి ,షూటింగ్ పూర్తి చేయకుండానే ఆపేశారు. ఆ సమయంలో రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడింది. తమ్ముడు విజయేంద్రప్రసాద్ తో కలిసి నాగార్జున జానకిరాముడుకి రచన చేశారు.

అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు కొడుకు కీరవాణి, ఇంకోవైపు తమ్ముడు విజయేంద్రప్రసాద్ కెరీర్ వెలిగిపోతుండగా శివశక్తిదత్తా సంస్కృతంలోనూ పట్టు సాధించి పలు గేయాలు, రచనలు చేసేవారు. 1996లో విజయేంద్రప్రసాద్ తో కలిసి అర్ధాంగిని డైరెక్ట్ చేశారు కానీ అది ఫ్లాప్ అయ్యింది. తర్వాత 2007లో కృష్ణ హీరోగా చంద్రహాస్ ని తీశారు. అది ఆశించిన ఫలితం అందుకోలేదు. పాటల రచయితగా శివశక్తి దత్తా ఛత్రపతి, బాహుబలి,. ఓం నమో వెంకటేశాయ, ఎన్టీఆర్ కథానాయకుడు, సవ్యసాచి, జాంబీరెడ్డి, హనుమాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గీత రచన చేశారు. ఈయన స్వర్గస్థులు కావడం ఇండస్ట్రీకి తీరని లోటు.