సుకుమార్‌తో పోల్చుకున్న రాఘవేంద్రరావు

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వైభవం చూసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. 80వ దశకం నుంచి ఓ రెండు దశాబ్దాలకు పైగా ఆయన హవా సాగింది. దర్శకుడిగా ప్రైమ్‌లో ఉండగా రాఘవేంద్రరావు మీడియా ముందుకే వచ్చేవారు కాదు. ఇంటర్వ్యూలూ ఇచ్చేవారు కాదు. కానీ దర్శకుడిగా రిటైరయ్యాకే ఆయన సినిమా వేడుకల్లో పాల్గొంటున్నారు. టీవీ షోలు, ఇంటర్వ్యూలో కూడా కనిపిస్తున్నారు. ఆయన వాయిస్ బాగా వినిపిస్తోంది. తాజాగా అమెరికాలో జరిగిన నాట్స్ ఈవెంట్‌కు రాఘవేంద్రరావు అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుకకు అగ్ర దర్శకుడు సుకుమార్, స్టార్ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ప్రసంగిస్తూ.. తనకు, సుకుమార్‌కు చాలా పోలికలున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరికీ గడ్డం ఉందంటూ మొదటి పోలిక చెప్పిన ఆయన.. తామిద్దరం అడవినే నమ్ముకుని పెద్ద దర్శకులుగా ఎదిగినట్లు చెప్పుకొచ్చారు. తనకు ‘అడవి రాముడు’ దర్శకుడిగా అతి పెద్ద బ్రేక్ అని.. అలాగే సుకుమార్ ‘పుష్ప’ సినిమా కోసం అటవీ నేపథ్యాన్ని తీసుకుని తిరుగులేని దర్శకుడిగా ఎదిగారని.. అల్లు అర్జున్‌ను పెద్ద స్టార్‌ను చేశారని అన్నారు రాఘవేంద్రరావు. తాను హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన బన్నీ, శ్రీలీల ఈ ఈవెంట్లో పాల్గొనడం సంతోషంగా ఉందని రాఘవేంద్రరావు అన్నారు.

ఇక సుకుమార్ మాట్లాడుతూ.. యుఎస్ తెలుగు ప్రేక్షకులకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఇక్కడి ప్రేక్షకులు ‘1 నేనొక్కడినే’ సినిమాను ఆదరించడం వల్లే తనకు మరో సినిమా అవకాశం దక్కిందని, లేదంటే కష్టమయ్యేదని చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థకు అధినేత అయిన నవీన్ ఎర్నేని తెలుగు సినిమాకు అందించిన ఘనత కూడా అమెరికా తెలుగు ప్రజలదే అని.. ఇందుకు కూడా తాను కృతజ్ఞుడనని సుకుమార్ అన్నారు. బన్నీ మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు ఎక్కడున్నా తగ్గేదే లేదని.. ఇంతమంది తెలుగు వాళ్లను ఇక్కడ చూస్తుంటే ఏ విశాఖపట్నంలోనో, హైదరాబాద్‌లోనో ఉన్నట్లుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించాడు.