చాప కింద నీరులా వార్ 2 స్ట్రాటజీలు

దేశంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్లను అధిక శాతం లాక్ చేసుకోవడం దగ్గరి నుంచి కూలీకి చెక్ పెట్టే స్ట్రాటజీ మొదలుపెట్టిన వార్ 2 ఇప్పుడు స్క్రీన్ కౌంట్ పరంగా కూడా భారీ కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. సుమారుగా 9000 స్క్రీన్లను వార్ 2 కోసం సిద్ధం చేసే పనిలో యష్ రాజ్ ఫిలింస్ ఉన్నట్టు ట్రేడ్ టాక్. బజ్ విషయంలో రజనీకాంత్ సినిమానే ముందంజలో ఉన్నప్పటికీ బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉన్న యష్ సంస్థ చాలా తెలివిగా రాష్ట్రాల వారీగా బలమైన పంపిణీదారులు ఎంచుకుని దానికి తగ్గ గ్రౌండ్ ని సిద్ధం చేస్తోంది. ఒకవేళ ఇది కనక నిజమైతే 2.0, పుష్ప 2 కన్నా అతి పెద్ద రిలీజ్ వార్ 2కే దక్కుబోతోంది.

ఒక్క తమిళనాడు, కేరళలో కూలికి సానుకూలాంశాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ కొంత నిర్లక్ష్యంగా ఉండటం వల్ల స్క్రీన్లు మెల్లగా చేజారిపోతున్నాయని రజనీకాంత్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఆగస్ట్ 14 ఎంతో దూరంలో లేదు. ఇంకో నలభై రోజుల్లో వచ్చేస్తుంది. బిగ్గెస్ట్ క్లాష్ అఫ్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతున్న కూలి వర్సెస్ వార్ 2 మీద బయ్యర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు కలిపి ఎంత లేదన్నా వెయ్యి కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ చేయబోతున్నాయని ఒక అంచనా. రెండింటికి బ్లాక్ బస్టర్ టాక్స్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా రికార్డులు బద్దలు కావడం ఖాయం.

వార్ 2 ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తీస్తున్న ఈ డాన్స్ నెంబర్ ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. కొరియోగ్రఫీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారట. ఇక కూలి సంగతికొస్తే అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయినట్టే. ఈ నెలాఖరులోగా ఫైనల్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు వెళ్ళిపోతారు. వరల్డ్ వైడ్  స్క్రీన్ కౌంట్ పరంగా ఎవరిది పై చేయి అవుతుందంటే వార్ 2 సమాధానమే వినిపిస్తోంది.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు పెద్ద స్టార్ క్యాస్టింగ్ కూలీకి పెద్ద ప్లస్ కానుంది.