నిన్న విడుదలైన తమ్ముడు పబ్లిక్ టాక్, రివ్యూలు అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. కనీసం యావరేజ్ అనిపించుకునే స్థాయిలోనూ స్పందన లేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశపరుస్తోంది. భారీ ఓపెనింగ్ ఆశించకపోయినా నితిన్ స్థాయి కంటే తక్కువగా నమోదు కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాత దిల్ రాజు అంతా తానై ప్రమోషన్లు చేసినా సరే దానికి తగ్గ ఫలితం కనీసం సగం కూడా దక్కేలా లేదు. ఫస్ట్ డే కలెక్షన్లు, రెస్పాన్స్ చూస్తుంటే మొదటి వీకెండ్ కే ఎదురీదడం తప్పేలా లేదు. సాధారణంగా ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాలకు కనిపించే సక్సెస్ మీట్ల హడావిడి తమ్ముడికి జరగలేదు.
ప్రాక్టికల్ గా చూస్తే నితిన్ పూర్తిగా మాస్ వలయంలో చిక్కుకుపోయి తప్పటడుగులు వేస్తున్న వైనం కనిపిస్తోంది. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడు, తమ్ముడు ఈ నాలుగు సినిమాల్లోనూ ఒక కామన్ పాయింట్ గమనించవచ్చు. ఏదో ఒక ఊరు లేదా కుటుంబం విలన్ వల్ల ప్రమాదంలో ఉంటే హీరో వెళ్లి వీరోచితంగా పోరాడి రక్షించడం. ఇది కన్విన్సింగ్ గా చూపించడం కోసం యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ ఎలిమెంట్లు ఓవర్ డోస్ లో దట్టించడం. ఈ దర్శకులందరూ నితిన్ ని హ్యాండిల్ చేసే విషయంలో ఇదే పొరపాటుని రిపీట్ గా చేస్తూనే రావడం ఒకే ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ ఇస్తోంది. ఇది విశ్లేషించుకోవాలి.
నితిన్ వీలైనంత త్వరగా స్కూల్ మార్చాలి. ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే, అఆ తరహా సాఫ్ట్ అండ్ లవ్ ఎంటర్ టైనర్స్ వైపు షిఫ్ట్ అయిపోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యేందుకు ఎలాంటి కథలు కావాలో వాటిని గుర్తించాలి. నాని తరహా మోడల్ సెట్ చేసుకోవాలి. దసరా చేసిన వెంటనే హాయ్ నాన్నకు వెళ్లిన న్యాచురల్ స్టార్ రిస్క్ ని గుర్తు చేసుకోవాలి. వరుస ఫ్లాపులతో మార్కెట్ డౌన్ అయ్యాక తిరిగి నిలబెట్టుకోవడం సులభం కాదు. ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో బలగం ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందే ఎల్లమ్మ ఉంది. ఇది కూడా పెద్ద బడ్జెటే. కాకపోతే వేణు శైలి రెగ్యులర్ గా ఉండదనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates