ఇటీవలే విడుదలైన థగ్ లైఫ్ డిజాస్టర్ గురించి కమల్ హాసన్ ఫ్యాన్స్ కన్నా ఎక్కువ టెన్షన్ పడింది రామ్ చరణ్ అభిమానులే. ఎందుకంటే దానికి సంగీతం ఇచ్చిన ఏఆర్ రెహమానే పెద్దికి మ్యూజిక్ డైరెక్టర్ కావడం వల్ల తమ హీరోకు ఎలాంటి అవుట్ ఫుట్ ఇస్తాడోననే టెన్షన్ వాళ్లలో ఉంది. అయితే రెహమాన్ చెబుతున్న మాటలు వింటే దర్శకుడు బుచ్చిబాబుని తక్కువంచనా వేయడానికి లేదనిపిస్తోంది. పెద్దిలో ఒక్కో పాటకు బుచ్చి మూడు రెఫరెన్సులు ఇచ్చాడట. వాటిని ఆధారంగా చేసుకుని తనకు బెస్ట్ ఇవ్వమని అడిగాడట. వాటిలో అధిక శాతం ఒకప్పుడు రెహమాన్ ఇచ్చిన ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కావడం గమనించాల్సిన విషయం.
ఇది జరిగిన తర్వాతే బుచ్చిబాబు మ్యూజిక్ టేస్ట్ ఎంత గొప్పదో తనకు అర్థమయ్యిందని రెహమాన్ చెప్పడం చూస్తే పెద్దికి ఎలాంటి వర్క్ జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి టీజర్ బిజిఎంతోనే చాలా డౌట్లు తీరిపోయాయి. మణిరత్నం లాంటి వాళ్ళకే బెస్ట్ ఇవ్వలేకపోతున్న రెహమాన్ కేవలం ఒక్క సినిమా అనుభవమున్న బుచ్చిబాబుకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోననే అనుమానం సహజం. అయితే మనోడు అంత ఆషామాషిగా వదలడం లేదట. బ్రతిమాలి, బామాలి, తన అభిమానాన్ని ప్రదర్శించి గత కొన్నేళ్లలో ఏఆర్ రెహమాన్ ఏ సినిమాకు ఇవ్వని గొప్ప స్కోర్ చేయించుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్.
ఇది నిజమైతే మంచిదే. అసలే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అది పెద్దితో తీరుతుందనే నమ్మకం వాళ్ళలో బలంగా ఉంది. ఇంకా రిలీజ్ కు పది నెలల టైం ఉన్నప్పటికీ ఇప్పటికే సగం దాకా షూటింగ్ పూర్తి చేసిన బుచ్చిబాబు ఈ నెలలోనే పాటల చిత్రీకరణ షురూ చేయబోతున్నాడు. శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న పెద్దిలో జాన్వీ కపూర్ గ్లామర్ ప్రత్యక ఆకర్షణ కానుంది. వచ్చే ఏడాది మార్చి 27 విడుదల కాబోతున్న ఈ స్పోర్ట్స్ విలేజ్ డ్రామాకు అప్పుడే బిజినెస్ ఎంక్వయిరీలు పీక్స్ లో ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates