అవే రాకాసి బల్లులు… అదే కథ

ముప్పై రెండు సంవత్సరాల క్రితం 1993లో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్ తీసిన జురాసిక్ పార్క్ ఒక అద్భుతం. టెక్నాలజీ అప్పుడప్పుడే కొత్త పుంతలు తొక్కుతున్న రోజుల్లో వెండితెర మీద రాకాసి బల్లులతో చేయించిన విధ్వంసం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ కాకపోయినా కేవలం ఇంగ్లీష్ వెర్షన్ తోనే ఇండియాలో రికార్డులు సాధించిన మొదటి హాలీవుడ్ మూవీగా అప్పట్లో దీని గురించి పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. తర్వాత ఈ సిరీస్ లో వేర్వేరు దర్శకులు ఇదే బ్రాండ్ వాడుకుంటూ సినిమాలు తీస్తూ వచ్చారు. తాజాగా జురాసిక్ వరల్డ్ రీ బర్త్ పేరుతో 2025 ఎడిషన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ వల్ల ఇండియాలో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కంటెంట్ పరంగా చూస్తే అబ్బే పెద్దగా ఏం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా రొటీన్ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్. మూడు రకాల అరుదైన రాకాసి బల్లుల రక్త నమూనాలు సేకరించి వాటి ద్వారా మిలియన్ల డాలర్ల సొమ్ము సంపాదించవచ్చని భావించిన ఒక బృందం ప్రమాదకరమైన దీవికి బయలుదేరుతుంది. అదే సమయంలో అనుకోకుండా ఒక కుటుంబం అక్కడికి వచ్చి ఇరుక్కుంటుంది. ప్రాణాలు తోడేసే డైనోసర్ల మధ్య వీళ్ళ వేట మొదలవుతుంది. ఆ తర్వాత జరిగేదేంటో తెరమీద చూడాలి.

విపరీతంగా అంచనాలు పెట్టుకుంటే జురాసిక్ వరల్డ్ రీ బర్త్ సంతృప్తిని ఇవ్వదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా ఎక్కువ డైలాగులతో సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి వేగం పెరుగుతుంది. నీటిలో చిన్న పాప వెనుక డైనోసర్ వెంటపడే ఎపిసోడ్, కొండ అంచుల మీద టీమ్ చేసే విన్యాసాలు అలరిస్తాయి. ఇవి మినహాయించి క్లైమాక్స్ తో సహా మిగిలిన సినిమాలో పెద్ద మెరుపులు ఉండవు. జురాసిక్ పార్ట్, ది లాస్ట్ వరల్డ్ తో పోలిస్తే రీ బర్త్ లో గూస్ బంప్స్ తక్కువ. ఈ సిరీస్ కు వీరాభిమాని అయితే కొంత మేర ఎంజాయ్ చేయొచ్చు కానీ ఓవర్ ఎక్స్ పెక్ట్ చేసి నెవెర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.