‘బాహుబలి’ దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించాక.. సౌత్ ఇండియా నుంచి, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా పేరుతో చాలా చిత్రాలను రిలీజ్ చేశారు కానీ.. వాటిలో ప్రభావం చూపినవి తక్కువే. ప్రభాస్, రాజమౌళి చిత్రాలను పక్కన పెడితే.. పుష్ప, కార్తికేయ-2 లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ఉత్తరాదిన మంచి వసూళ్లు సాధించాయి. వీటిలో ఏదో ఒక పాయింట్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయి ఊహించని స్థాయిలో వసూళ్లు అందించారు ఆడియన్స్. అలా అని వాటిని అనుకరించిన సినిమాలను పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగు నుంచి పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసిన మరో చిత్రం.. హరిహర వీరమల్లు. ఎంతో పొటెన్షియాలిటీ ఉండి కూడా సరైన సినిమాలు చేయకపోవడం వల్ల పవన్ పాన్ ఇండియా స్థాయికి ఎదగలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది.
‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ టీజర్ లాంచ్ అయినపుడు.. పవన్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో విస్తరించడానికి ఇదే సరైన సినిమా అనుకున్నారు. కానీ ఈ చిత్రం బాగా ఆలస్యం కావడంతో దీని చుట్టూ నెగెటివిటీ ముసురుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రేజ్ తగ్గిపోయింది.
ఐతే ఈ రోజు లాంచ్ అయిన ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ అభిమానుల్లో బాగానే ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కూడా సత్తా చాటే అవకాశాలను కొట్టిపారేయలేం. ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ట్రైలర్లో కనిపించాయి. ఇందులో కథానాయకుడిది ఔరంగజేబుకు ఎదురెళ్లి, హిందూ ధర్మం కోసం పోరాడే పాత్ర. గత ఏడాది ఇలాంటి నేపథ్యంలోనే ‘ఛావా’ సినిమా తీస్తే ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ‘వీరమల్లు’లోనూ ఆ ఛాయలు కనిపించాయి.
‘‘హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం..’’ అంటూ ట్రైలర్‌కు ఇచ్చిన ఇంట్రోతోనే నార్త్ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది. కోహినూర్ వజ్రం గురించిన ప్రస్తావన.. ‘‘హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా ఎగరాలి’’ అంటూ బాబీడియోల్ చేసిన ఔరంగజేబు పాత్రతో చెప్పించడం కూడా హిందీ ఆడియన్స్ అటెన్షన్ రాబట్టే విషయాలు. ఇక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య సనాతన ధర్మం గురించి బలంగా వాయిస్ వినిపిస్తున్న తీరు ఇతర రాష్ట్రాల వాళ్లను ఆకర్షిస్తోంది.
ఇప్పుడు సినిమాలో కూడా ఆ ధర్మాన్ని కాపాడే పాత్ర చేస్తుండడం.. ప్రధాని నరేంద్ర మోడీ ఓ సందర్భంలో పవన్‌ను అభివవర్ణిస్తూ వాడిన ‘ఆందీ’ (తుపాను) అనే మాటను ట్రైలర్లో వినిపించిన నేపథ్యంలో ఈ సినిమాతో ఎక్కువమంది కనెక్ట్ కావడానికి అవకాశముంది. సినిమా ఆసక్తికరంగా సాగితే ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కొచ్చు. మరి పుష్ప, కార్తికేయ-2 తరహాలోనే ‘వీరమల్లు’ కూడా పాన్ ఇండియా స్థాయిలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates