మహేష్.. ఏమాయ చేసావె.. చిరు క్యామియో

ఒక కథ ఎవరి కోసమో పుట్టి.. ఇంకెవరి చేతుల్లోకో వెళ్లడం ఫిలిం ఇండస్ట్రీలో కామన్‌గా జరిగే విషయమే. అలా చేతులు మారిన కథల్లో ‘ఏమాయ చేసావె’ కూడా ఒకటి. తమిళ లెజెండరీ డైరెక్టర్ ఫిల్మోగ్రఫీలో ఇది చాలా స్పెషల్ మూవీ. తమిళంలో శింబు-త్రిష జంటగా ‘విన్నైతాండి వరువాయ’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో అదే కథను నాగచైతన్య-సమంత జంటగా సమాంతరంగా ‘ఏమాయ చేసావె’ పేరుతో తీస్తే ఇక్కడా క్లాసిక్ అనిపించుకుంది. ఐతే తెలుగులో ఈ చిత్రాన్ని గౌతమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలనుకున్నాడట. మహేష్ పేరు ఎత్తకుండానే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ పంచుకున్నాడు.

తెలుగులో ‘ఏమాయ చేసావె’ను ప్రొడ్యూస్ చేసిన ఫ్యామిలీకి చెందిన సూపర్ స్టార్ హీరోతోనే ఈ సినిమా తీయాలనుకున్నానని గౌతమ్ చెప్పాడు. కథ రాసేటపుడే ఆ ‘సూపర్ స్టార్‌’ను దృష్టిలో ఉంచుకుని రాశానని గౌతమ్ వెల్లడించాడు. వారం రోజుల్లో ఈ కథ రాసేశానని.. ఫస్ట్ డ్రాఫ్ట్‌లో క్లైమాక్స్ కూడా డిఫరెంట్‌గా ఉండేదని గౌతమ్ తెలిపాడు. దాని ప్రకారం ఈ కథలోని హీరో ఒక సినిమా సెట్స్‌లో పని చేస్తుంటాడని.. అది మెగాస్టార్ చిరంజీవి సినిమా అని.. అతను డిస్టర్బ్డ్‌గా ఉంటే ఏంటి అని చిరు అడుగుతాడని.. తన ప్రేయసి పెళ్లి జరుగుతోందని చెబితే.. వెంటనే తన హెలికాఫ్టర్ ఇచ్చి పంపిస్తాడని గౌతమ్ చెప్పడం విశేషం.

ఐతే ఈ కథను ఆ స్టార్ హీరోకు నరేట్ చేస్తే.. మనిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకులు యాక్షన్ సినిమా ఆశిస్తారని.. ఇలాంటి లవ్ స్టోరీ చేయడం కష్టమని తిరస్కరించినట్లు గౌతమ్ వెల్లడించాడు. తర్వాత తాను మరో టాలీవుడ్ స్టార్‌కు ఈ కథ చెబితే.. అక్కడే ఇదే సమాధానం రావడంతో డ్రాప్ అయి కొత్త హీరో అయిన నాగచైతన్యతో చేసినట్లు గౌతమ్ వెల్లడించాడు. గౌతమ్ చెప్పిన ఈ విషయలు విన్నాక నిజంగా మహేష్ బాబు ఈ సినిమాలో నటించి.. అందులో చిరు క్యామియో చేసి ఉంటే ఎలా ఉండేదన్న ఊహల్లోకి వెళ్లిపోతున్నారు అభిమానులు.