‘ఐకాన్’గా మారే హీరో ఎవరు?

ఐకాన్.. అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు కొన్నేళ్ల కిందట అనౌన్స్ చేసిన సినిమా. నోటి మాటగా చెప్పడం కాదు.. ఏకంగా ప్రి లుక్ పోస్టర్ కూడా వదిలింది ఎస్వీసీ సంస్థ. అల్లు అర్జున్ సైతం కొన్ని రోజులు ఐకాన్ పేరుతో ఉన్న టోపీ పెట్టుకుని తిరిగి షూట్ మొదలుకాకముందే ఈ సినిమాను ప్రమోట్ చేశాడు కూడా. కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. ‘పుష్ప-1’ అయ్యాక ఈ సినిమా ఉంటుందన్నారు. ‘పుష్ప-2’ తర్వాత దీన్ని బన్నీ టేకప్ చేయొచ్చన్నారు. తీరా చూస్తే బన్నీ క్యాన్సిల్ చేసిన అనేక సినిమాల్లో ఇది ఒకటిగా మారింది. బన్నీ చేయకపోతే ఈ సినిమా అటకెక్కేసినట్లే అనుకున్నారు.

కానీ వేరే హీరోతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి వేణు, దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని వీళ్లిద్దరూ వేర్వేరుగా ఇంటర్వ్యూల్లో కన్ఫమ్ చేశారు. వేణు దర్శకత్వంలో రాజు నిర్మించిన ‘తమ్ముడు’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మీద దర్శక నిర్మాతలిద్దరూ చాలా ధీమాాగా ఉన్నారు. ఈ సినిమా రిలీజైన కొన్ని వారాల తర్వాత ‘ఐకాన్’ పనులు మొదలవుతాయట. ‘ఐకాన్’ కథకు సరిపోయే హీరో కోసం వెతుకుతున్నట్లు వేణు తెలిపాడు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఐకాన్’ను బన్నీ ఎందుకు చేయలేకపోయాడో వెల్లడించాడు. ఈ కథ బన్నీకి భలే నచ్చిందని.. స్క్రిప్టు విషయంలో వేణు శ్రీరామ్‌ను ఎంతగానో మెచ్చుకున్నాడని తెలిపాడు.

ఐతే ‘పుష్ప’ చేశాక బన్నీ ఇమేజ్ మారిపోయిందని.. ‘పుష్ప-2’తో పాన్ ఇండియా రేంజిలో పెద్ద స్టార్‌గా అవతరించాడని.. ఇప్పుడున్న ఇమేజ్‌తో బన్నీకి ఈ కథ చిన్నదైపోతుందని.. అందుకే అతను ఈ సినిమా చేయట్లేదని రాజు తెలిపాడు. బన్నీ రేంజికి తగ్గట్లుగా తాము వేరే సినిమా చేస్తామన్నారు. ‘ఐకాన్’ కథ బాగుంది కాబట్టి మరో హీరోతో ఈ సినిమా తప్పకుండా చేస్తామన్నాడు. ఐతే బన్నీ ఇమేజ్‌కు సరిపోదని అన్నారంటే.. మిగతా పెద్ద హీరోలెవ్వరూ ఈ సినిమా చేయరన్నట్లే. మరి మారిన ఇమేజ్ దృష్ట్యా బన్నీ ఈ కథను పక్కన పెట్టాడు అంటే.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఇగో లేకుండా ఈ కథలో నటించే హీరో ఎవరన్నది ప్రశ్న. రామ్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి మిడ్ రేంజ్ హీరోలెవరితో అయినా ఈ సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూడాలి.