2025 అతి పెద్ద డిజాస్టర్స్ లో ముందు గుర్తొచ్చే పేరు గేమ్ ఛేంజర్. భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన ఈ ప్యాన్ ఇండియా మూవీ కనీస స్థాయిలో మెప్పించలేక దారుణంగా ఫెయిల్ కావడం మెగా ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినా ఏమి అనలేని పరిస్థితిలో మౌనంగా ఉన్నారు. మూడేళ్ళ విలువైన కాలాన్ని దర్శకుడు శంకర్ కోసం తాకట్టు పెడితే ఇంత దారుణమైన ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. అప్పన్నగా చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ దానికి మద్దతు ఇచ్చేలా కనీస స్థాయిలో కథా కథనాలు లేకపోవడం ఇంత పెద్ద ఫ్లాపుని చేతిలో పెట్టింది.
అప్పటి నుంచి నిర్మాత దిల్ రాజు నేరుగా గేమ్ ఛేంజర్ ప్రస్తావన తెచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా అడిగే ప్రయత్నం చేసినా దాటవేశారు తప్పించి ఎక్కువగా స్పందించేందుకు ఇష్టపడలేదు. కానీ తమ్ముడు విడుదల సందర్భంగా చేస్తున్న ప్రమోషన్లలో ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. తాజాగా జరిగిన థియేటర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ వల్ల రామ్ చరణ్ కు హిట్ ఇవ్వలేదనే చిన్న గిల్ట్ ఫీలింగ్ అలాగే ఉండిపోయిందని, అది తీరిపోయేలా మరో మంచి సినిమాకు శ్రీకారం చుడతామని, ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని స్టేజి మీద ప్రకటించడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది.
పెద్ది, సుకుమార్ తో ఆర్సి 17 తర్వాత రామ్ చరణ్ ఎవరితో చేస్తాడనే దాని మీద ఇంకా సరైన క్లారిటీ లేదు. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఖచ్చితమైన కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు దిల్ రాజు సెట్ చేయబోయే కాంబో ఎవరిదనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రస్తుతం కథ సిద్ధంగా లేదు. ఆ అన్వేషణలోనే దిల్ రాజు ఉన్నారు. సబ్జెక్టు నచ్చితే చేయడానికి చరణ్ సానుకూలంగానే ఉన్నాడట. వీళిద్దరి కాంబోలో ఎవడు సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈసారి శ్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఇచ్చే కథతో ఏ దర్శకుడు వస్తాడో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates