ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనోద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ అయిపోతాడేమోనని భావించిన సిద్దార్థ్ ఆ తర్వాత వరస ఫ్లాపులతో టాలీవుడ్ కు దూరమై తమిళంలో సెటిలయ్యాడు. మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా దాని డిజాస్టర్ ఫలితం వల్ల పనవ్వలేదు. అయితే క్రమం తప్పకుండా డబ్బింగ్ సినిమాల ద్వారా థియేటర్లను పలకరించే సిద్దార్థ్ కొత్త మూవీ 3 బిహెచ్కెతో మరోసారి జూలై 4 లక్కును పరీక్షించుకోనున్నాడు. తరచుగా తన స్టేట్ మెంట్ల ద్వారా కాంట్రావర్సిలు తెచ్చుకునే సిద్దు తన వాదనే కరెక్టనిపించేలా మాట్లాడ్డం పలు సందర్భాల్లో జరిగింది. తాజాగా 3 బిహెచ్కె ఈవెంట్ లోనూ ఇలాంటిది చోటు చేసుకుంది.
పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఎవరికో మనీ రావడానికి తాను సినిమాలు చేయడం లేదని, మీకలా అనిపిస్తే నేనేం చేయలేనని అన్నాడు. నిజానికి ఇక్కడో లాజిక్ మిస్సయ్యాడు. పాత్రల విషయంలో ఆర్టిస్టు ఎంత సంతృప్తి చెందినా ఫైనల్ గా నిర్మాతకు డబ్బులు రావాలి. హీరో హీరోయిన్ల నటన మీద పొగడ్తల వర్షం కురవొచ్చు. కానీ అది థియేటర్ వసూళ్లుగా మారనప్పుడు ప్రొడ్యూసర్ పెట్టుబడి వృథా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు డబ్బులు రావాలనే ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకోవాలి. అంతేతప్ప ఎవరికో మనీ రావడానికి చేయను అని చెప్పడం తర్కంకు దూరం.
చిన్న సినిమా అన్నందుకు కూడా సిద్దార్థ్ కు కోపం వచ్చింది. చిన్నా పెద్ద భేదం ఉండదని విషయం లోతుగా ఉండాలి తప్ప బడ్జెట్ కోణంలో తేడాలు ఉండకూడదని అన్నాడు. ప్రాక్టికల్ గా చూస్తే వందల కోట్లు పెట్టి తీసే ప్యాన్ ఇండియా మూవీస్, ఆరేడు కోట్లలో తీసే చిన్న సినిమాలు రెండూ ఒకటే కాదు. బడ్జెట్, వసూళ్లు రెండింటిలోనూ బోలెడు వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు సిద్దార్థ్ చేస్తున్నది ఖచ్చితంగా మీడియం సినిమా. ఎంత బాగున్నా పుష్ప లాగా వెయ్యి కోట్లు దాటదుగా. సూపర్ హిట్ అయినా వంద కోట్లు దాటితే గొప్ప. ఆ కోణంలో చిన్నా పెద్దా అనే తేడా ఖచ్చితంగా ఉంటుంది. సింపుల్ గా తట్టే విషయాలివి.
Gulte Telugu Telugu Political and Movie News Updates