రామ్ చరణ్… ఆస్కార్ పై రేవంత్ ప్రశంసలు

మెగాస్టార్ త‌న‌యుడు, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. చిరంజీవి కొడుకైన‌ప్ప‌టికీ.. చ‌ర‌ణ్ త‌న సొంత ప్ర‌తిభ‌తో గొప్ప న‌టుడిగా ఎదిగాడ‌ని.. ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్ అవార్డు సాధించి దేశానికి గౌర‌వం తీసుకొచ్చాడ‌ని ఆయ‌న కొనియాడారు. చిరంజీవి కొడుక‌న్న గుర్తింపుతో మ‌నం ఫంక్ష‌న్ల‌కు పిలుస్తాం త‌ప్ప ఆస్కార్ అవార్డు ఇవ్వ‌లేమ‌ని.. అది చ‌ర‌ణ్ సాధించాడ‌ని రేవంత్ ప్ర‌శంసించారు. అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగం, అక్ర‌మ ర‌వాణా వ్యతిరేక దినం సందర్భంగా హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేదిక‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, టీఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు త‌దిత‌రులు అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్‌, విజ‌య్, రాజు.. ముఖ్య‌మంత్రి కారులో వేదిక వ‌ద్ద‌కు చేరుకోవ‌డం విశేషం. సీఎం రేవంత్ ప్ర‌సంగిస్తూ చ‌ర‌ణ్ మీద ప్ర‌శంస‌లు కురిపించారు. ”చరణ్ స్కూలుకి వెళ్ళేటప్పటి నుండి నాకు తెలుసు, చరణ్ ఏదో ఒక రోజు గొప్పవాడు అవుతాడని అనుకున్నా. ఈ రోజు చరణ్ ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను, చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా దేశానికి గౌరావాన్ని తెచ్చి పెట్టాడు, చిరంజీవి కొడుకు అయితే మనం ఫంక్షన్లకు పిలుస్తాం కానీ.. ఆస్కార్ అవార్డు ఇవ్వ‌లేం. చరణ్ కష్టపడ్డాడు కాబట్టి నటనలో రాణించాడు కాబట్టి ఆయన సినిమాకు ఆస్కార్ అవార్డు వ‌చ్చింది. యువ‌త చర‌ణ్‌ను చూసి స్ఫూర్తి పొందాలి. త‌ప్పుడు దారుల్లో న‌డ‌వ‌కూడ‌దు” అని రేవంత్ అన్నారు.

తెలంగాణ యువ‌త‌లో డ్ర‌గ్స్ వినియోగం పెర‌గ‌డం ప‌ట్ల రేవంత్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ”ఉద్యమ స్పూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ ఈ రోజు డ్రగ్స్ మహమ్మారికి బలవ్వడం బాధపడాల్సిన సందర్భం. ఉద్యమాల గడ్డ ఇలా గంజాయికో, డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానం కాదా అని ఒకసారి ఆలోచన చేయండి. చిరంజీవి  లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎదిగారే తప్ప, కష్టాలొచ్చినా, అవమానాలకు లోనైనా ఏనాడూ బాధతో కుంగిపోలేదు, భయంతో మాదకద్రవ్యాల వైపో, వ్యసనాల వైపో బానిసలు కాలేదు” అని రేవంత్ అన్నారు.